సేవ్‌ అమరావతి.. సేవ్‌ టీటీడీ

ABN , First Publish Date - 2020-05-27T08:43:23+05:30 IST

సేవ్‌ అమరావతి.. సేవ్‌ టీటీడీ.. అంటూ మంగళవారం చేపట్టిన ఆందోళనల్లో రాజధాని ప్రాంత గ్రామాల..

సేవ్‌ అమరావతి.. సేవ్‌ టీటీడీ

గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 26: సేవ్‌ అమరావతి.. సేవ్‌ టీటీడీ.. అంటూ మంగళవారం చేపట్టిన ఆందోళనల్లో రాజధాని ప్రాంత గ్రామాల రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. తిరుమల ఆస్తుల రక్షణ కోసం బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపవాస దీక్ష చేపట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని చేపట్టి సేవ్‌ అమరావతి, సేవ్‌ టీటీడీ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని కాపాడాల్సిన నైతిక బాధ్యత బీజేపీపై ఉందన్నారు. 


 లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ తుళ్లూరు, అనంతవరం, మందడం, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, దొండపాడు, పెదపరిమి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, వెంకటపాలెం, నీరుకొండ, ఐనవోలు ఇలా 29 గ్రామాల్లో మహిళలు, రైతులు, కూలీలు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం నుంచి అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తమ పోరు ఆపేది లేదని రైతులు చెప్పారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని మహిళలు, రైతులు కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 36వ రోజుకు చేరుకున్నాయి.  

Updated Date - 2020-05-27T08:43:23+05:30 IST