వెదజల్లే విధానంతో ఖర్చులు ఆదా: డీఏవో పరశురాం నాయక్‌

ABN , First Publish Date - 2021-06-17T05:30:00+05:30 IST

వర్షాకాలంలో వరిసాగులో వెదజల్లే పద్ధతిని పాటిస్తే మంచి దిగుబడితో పాటుగా పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయని జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్‌ తెలిపారు.

వెదజల్లే విధానంతో ఖర్చులు ఆదా: డీఏవో పరశురాం నాయక్‌

తూప్రాన్‌రూరల్‌/నిజాంపేట, జూన్‌ 17: వర్షాకాలంలో వరిసాగులో వెదజల్లే పద్ధతిని పాటిస్తే మంచి దిగుబడితో పాటుగా పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయని జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్‌  తెలిపారు. గురువారం తూప్రాన్‌, నిజాంపేట మండలాల్లో రైతులు, ప్రజాప్రతినిధులకు వెదజల్లే సాగు, పంటమార్పిడి, జీవన ఎరువులు తదితర విధానాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పంటలకు స్వస్తిపలికి కొత్తరకం పంటలను సాగుచేస్తూ పంటమార్పిడి విధానాన్ని అవలంభించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో భూసారం పెరగడంతోపాటు చీడపీడల బెడద తగ్గుతుందని వివరించారు. వానాకాలం వరిసాగులో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించాలని, దీంతో భూమిలోని భాస్వరం మొక్కలకు సరిపడా అందుతుందన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పత్తి, కందులు, వేరుశనగ, పెసర, మినుము, నూనెగింజలు లాంటి డిమాండ్‌ ఉన్న పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. తూప్రాన్‌లో తోటనర్సింహులు అనే రైతు వెదజల్లే విధానంలో సాగుపై తన అనుభవాలను వివరించారు. తూప్రాన్‌లో ఏడీఏ సురేఖ, ఆత్మ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాబుల్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు సురేందర్‌రెడ్డ్డి, ఏవో నుస్రత్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు,  ఏఈవోలతో పాటు నిజాంపేట ఏవో సతీష్‌, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు బిజ్జ సంపత్‌, చంద్రయ్య, సొసైటీ చైర్మన్‌ బాపురెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-17T05:30:00+05:30 IST