కృష్ణాజలాల పరిరక్షణకు ‘సేవ్‌సాగర్‌’

ABN , First Publish Date - 2020-06-05T10:14:02+05:30 IST

సేవ్‌సాగర్‌ నినాదంతో కృష్ణాజలాలను పరిరక్షించుకోవాలని సీఎల్పీనేత భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లా

కృష్ణాజలాల పరిరక్షణకు ‘సేవ్‌సాగర్‌’

ఏపీ చర్యలను అడ్డుకోకపోతే ఖమ్మంజిల్లా ఆయకట్టుకు ప్రమాదం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌


కూసుమంచి, జూన్‌ 4: సేవ్‌సాగర్‌ నినాదంతో కృష్ణాజలాలను పరిరక్షించుకోవాలని సీఎల్పీనేత భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం ఆయన ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరులో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. శ్రీశైలం డ్యామ్‌పై సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకపోతుందన్నారు. ఫలితంగా నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీరు రాదని, భవిష్యత్తులో నల్గొండ, ఖమ్మంజిల్లాలకు అన్యాయం జరుగబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు మెదపడం లేదని, ఏపీ సీఎం జగన్‌కు, కేసీఆర్‌కు మధ్య సంబంధాలు ఉండటం వల్లే మాట్లాడటం లేదని ఆరోపించారు.


ఏపీ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే.. త్వరలో గోదావరి జలాలు వస్తున్నాయంటున్నారని, ఏప్పుడో వచ్చే గోదావరి జలాలు ముఖ్యమా..? ఇప్పుడు వచ్చే కృష్ణా జలాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఆనాడు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ తమ నాటకాలు బయట పడతాయనే ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంజిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై నీటి తరలింపును అడ్డుకోవాలని, సోమశిల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టును ఆడ్డుకోవాలని పిలుపినిచ్చారు.


సేవ్‌సాగర్‌ నినాదంతో సాగర్‌ జలాలను కాపాడుకోవాలని అన్ని మండలాలు తిరుగుతు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని భట్టి వివరించారు. జిల్లాకు జరిగే అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని, ప్రాజెక్టులను నిలువరించేవిధంగా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరానున్నట్టు పేర్కొన్నారు. ప్రజలే ప్రశ్నించేవిధంగా మొదట చైతన్యం తీసుకవస్తున్నట్లు తెలిపారు. కృష్ణాటిబ్యునల్‌ కూడా ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వకుండా  చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, న్యాయవాది మద్ది శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T10:14:02+05:30 IST