సమధర్మ వేగుజుక్క

ABN , First Publish Date - 2021-01-03T05:52:46+05:30 IST

సమాజంలోని సకల బాధితుల పట్ల సేవాదృక్పథం కనపరిచిన విశ్వమానవి సావిత్రిబాయి. ఆమె విశాల దృక్పథానికి భారతచరిత్రలో ఏ గుర్తింపులు, గౌరవాలు లభించలేదు. ఇది శోచనీయం, అంతేకాదు గర్హనీయం...

సమధర్మ వేగుజుక్క

సమాజంలోని సకల బాధితుల పట్ల సేవాదృక్పథం కనపరిచిన విశ్వమానవి సావిత్రిబాయి. ఆమె విశాల దృక్పథానికి భారతచరిత్రలో ఏ గుర్తింపులు, గౌరవాలు లభించలేదు. ఇది శోచనీయం, అంతేకాదు గర్హనీయం. సావిత్రిబాయి నిమ్న జాతిలో కాకుండా ఒక అగ్రవర్ణ కులీన కుటుంబంలో పుట్టి ఉంటే ఆమె సామాజికసేవకు చరిత్రంతా మోకరిల్లి ఉండేది కాదా?


పదిమంది మహిళామూర్తుల గౌరవార్థం పది విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంకల్పించింది. ప్రతిపాదిత ప్రతిభామూర్తులలో సావిత్రిబాయి ఫూలే లేరు! అజ్ఞానం, సామాజిక అసమానతల నిర్మూలనకు విశేష కృషి చేసిన సావిత్రిబాయిని 21వ శతాబ్ది భారతదేశం కూడా ఎందుకు గౌరవించడం లేదు? నాటి వలస పాలకులు చూపిన విజ్ఞతను నేటి ఆధునికానంతర భారతీయ మేధో ప్రపంచం ఎందుకు చూపడం లేదు? 


ఆధునిక చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే. కుల వ్యవస్థలో మానవహక్కులు కోల్పోయిన శూద్ర, ఎస్సీ కులాలవారికి, అన్ని కులాల మహిళలకు 1848లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన మొదటి ఉపాధ్యాయిని ఆమె. తన జీవిత పర్యంతం అణగారినవర్గాల వారికి విద్యను అందించడానికి, హిందూ సమాజంలోని ఆధిపత్య వర్గాలపై శతవిధాల పోరాడిన తొలి భారతీయ విద్యావేత్త సావిత్రిబాయి. సంఘసంస్కర్త అయిన ఈ విద్యావతి కవయిత్రి కూడా. 


సంఘ సముద్ధరణకు భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలేతో కలిసి ‘సత్యశోధక సమాజం’ను ఈ విదుషీమణి స్థాపించారు. శ్రామికజనుల్లో మద్యపాన వ్యసనాన్ని రూపుమాపేందుకు, కార్మిక, కర్షక మహిళల అభ్యున్నతికి ఉద్యమాలు నడిపిన గొప్ప సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి. ఆమె కాయకష్టం చేసే కుటుంబం నుంచి వచ్చిన మహిళ. తొమ్మిదేళ్ళ వయసులోనే ఆమెకు జ్యోతిరావు ఫూలేతో వివాహమయింది. ఆయన సాహచర్యంలో ఆమె విద్యావతి అయింది. సంఘ సంస్కరణకు, సమాజ దౌష్ట్యాలకు బలవుతున్నవారిని ఆదుకోవడానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి. జ్యోతిరావు ఫూలే మరణానంతరం కూడా సత్యశోధక సమాజాన్ని సమర్థంగా ముందుకు నడిపిన కార్యశీలి.


మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన అన్ని సామాజిక ఉద్యమాల్లో సావిత్రిబాయి ప్రధాన భాగస్వామి. జ్యోతిరావు ఫూలేకు ఆమె కేవలం అనుచరురాలు కాదు. అలా అయినట్టయితే మహిళా పాఠశాలలు, దళిత పాఠశాలలు, సత్యశోధక సమాజాలను ఆయన నడిపేవాడు కాదేమో?! సత్యశోధక సమాజ్ కార్యకలాపాలు, సంఘ సంస్కరణలు, పాఠశాలల ఏర్పాటు అన్నిటిలో సావిత్రిబాయి ప్రధాన భాగస్వామి అని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఫూలే దంపతులు 1848లో బాలికా పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు బ్రాహ్మణ సమాజం హర్షించలేదు. ఫూలేలకు తీవ్ర అడ్డంకులు సృష్టించింది. ఈ ప్రతికూలతలు అన్నిటినీ సావిత్రిబాయి ఓర్పు, నేర్పుతో సమర్థంగా ఎదుర్కొంది. స్వయంగా బోధించింది. విజయవంతంగా ఆ పాఠశాలను నడిపించింది.


జ్యోతిరావు ఫూలేకు సావిత్రిబాయి సహచరి మాత్రమే కాదు, సహ ఉద్యమకారిణి, సహ సంఘసంస్కర్త. ఆమె తోడ్పాటు, సహకారం లేకుండా జ్యోతిరావు ఫూలే ఒక్కడే అగ్రవర్ణాల వారి తీవ్ర వ్యతిరేకతలను తట్టుకుని సామాజిక ఉద్యమాల్ని ఒక్క చేత్తో నిర్మించడం సాధ్యమయ్యేది కాదు. అన్ని కులాల మహిళలకు విద్య, మాంగ్, మహర్లకు పాఠశాలలు, సత్యశోధక సమాజ స్థాపన... ఇంకా అనేక సామాజిక ఉద్యమాల్లో జ్యోతిరావు ఫూలేతో సమంగా నడిచిన ధీర సావిత్రిబాయి. 


‘నువ్వు ఇంటిపట్టున ఉండి కుటుంబాన్ని చూసుకో, నేను పోరాటం చేసి వస్తా’ అనే పురుష మహరాజులు నేటి ప్రజా ఉద్యమాల్లో కోకొల్లలు. ఇప్పటికీ సావిత్రిబాయి జయంతి, వర్ధంతి సమావేశాలను కూడా మహిళలు లేకుండానే మగవారే నడుపుతుండడం చూస్తున్నాం. రెండు శతాబ్దాల క్రితమే జ్యోతిరావు ఫూలే ఆచరించి చూపించిన జెండర్ ప్రజాస్వామ్యాన్ని బహుజన మగ సమాజం ఇప్పటికీ అందుకోలేకపోతున్నది. 


జ్యోతిరావు ఫూలే చదువులేని తన సహచరికి చదువు నేర్పి టీచర్‌గా తీర్చిదిద్ది, తన మేధో చైతన్యాన్ని, చదివిన ప్రతి పుస్తకాన్ని, తన ఆలోచనని సావిత్రిబాయికి పంచేవాడు, చర్చించేవాడు. తాను చేసే ప్రతి పనిలో ఆమెను తన భాగస్వామిని చేసుకునేవాడు. అలా ఫూలే నుంచి భావ చైతన్యాన్ని ఆవాహన చేసుకుని, కార్యాచరణ భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకున్నందువల్లే అగ్రవర్ణాల వారి నుంచి ఎదురైన తీవ్ర ప్రతిబంధకాలు, ప్రతిఘాతాలను సావిత్రిబాయి ధైర్యంగా ఎదుర్కోగలిగింది. వివిధ సంస్థలను దక్షతతో నిర్వహించి సమాజంలో అజ్ఞానాన్ని రూపుమాపింది. 


అసలు అంటరానివాళ్ళకు, ఆడవాళ్లకు చదువెందుకు? పైగా వారికి ఒక స్త్రీ చదువు నేర్పడమా? అని హుంకరించిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఫూలేలు నిర్వహిస్తున్న విద్యాలయాలు సంఘానికి కీడు అని తిట్టిపోసినా, ఛీకొట్టినా, పెండ నీళ్లు, అలుకునీళ్లు మీద పోసినా అవమానాలు అన్నిటినీ భరించి మహిళలకు, నిమ్నజాతుల వారికి చదువు చెప్పిన సాహసికురాలు సావిత్రిబాయి. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే సొంత కుల అస్తిత్వ వేదనలను ప్రతిభావంతంగా రాసి సమాజం ముందుంచిన మొదటి దళిత రచయిత్రి ముక్తా సాల్వే సావిత్రిబాయి బాలికా పాఠశాలలోని ప్రతిభా కుసుమమే. ఫాతిమా బేగం, సుగుణ వంటి బహుజన మహిళలు ఎందరినో టీచర్లుగా తీర్చిదిద్దిన ఉదాత్తురాలు సావిత్రిబాయి. 


దళిత మహిళల మీద జరుగుతున్న వ్యభిచార దురాచారాలకు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి ఉద్యమించింది. సతి, వైధవ్యం, అనాధ బాలలు, సమాజ ఆమోదం లేని సంతానం వంటి సమస్యలు, దురాచారాలు నిమ్నజాతి కులాల బహుజన మహిళలవి కావు. అవి బ్రాహ్మణ స్త్రీల చుట్టూ ఆవరించిన దురాచారాలుగా ఉండేవి. అణగారిన కులానికి చెందిన సావిత్రిబాయి ఒక వైపు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమాలు నడుపుతూనే విధి వంచితులు అయిన బ్రాహ్మణ స్త్రీలను అక్కున చేర్చుకుని వారికి మంచి బతుకును ఇచ్చేందుకు ఆశ్రమాలు నెలకొల్పింది. పరిపూర్ణ మానవతా దృక్పథంతో సాంఘిక దురాచారాల నిర్మూలనకు జీవితాంతం ఉద్యమించిన కులాతీత మానవి సావిత్రిబాయి. 


సమాజంలోని సకల బాధితుల పట్ల సేవాదృక్పథం కనపరిచిన విశ్వమానవి సావిత్రిబాయి. ఆమె విశాల దృక్పథానికి భారతచరిత్రలో ఏ గుర్తింపులు, గౌరవాలు లభించలేదు. ఇది శోచనీయం, అంతేకాదు గర్హనీయం. సావిత్రిబాయి నిమ్న జాతిలో కాకుండా ఒక అగ్రవర్ణ కులీన కుటుంబంలో పుట్టి ఉంటే ఆమె సామాజికసేవకు చరిత్రంతా మోకరిల్లి ఉండేది కాదా? మాలి కులంలో పుట్టి కులవ్యవస్థను, దాని విలువలను ప్రశ్నించి సామాజిక బాధితుల పక్షాన నిలబడింది కనుకనే బ్రాహ్మణ భావజాల ప్రభావిత భారతదేశ చరిత్రలు సావిత్రిబాయిని విస్మరించాయి. బ్రాహ్మణ కుల మగవాళ్ళనే సంఘసంస్కర్తలుగా చరిత్ర కీర్తి హారతులు పట్టింది. నిజానికి ఈ బ్రాహ్మణ మగసంస్కర్తలు ఎవరూ సామాజిక సంస్కర్తలు కారు. వారు కేవలం తమ కులంలోని దురాచారాలను జాతిని పీడిస్తున్న దురాచారాలుగా ప్రచారం చేశారు. విస్తృత బహుజన సమాజ దురాచారాలు వారికి పట్టలేదు. కనుకనే ఆ వర్గాల నుంచి ప్రభవించిన మానవోత్తములు గుర్తింపునకు నోచుకోక విస్మృతమయ్యారు. భారతజాతి ఉద్ధరణ పేరుతో బ్రాహ్మణ మగ సంస్కర్తలు ఏర్పాటు చేసిన బ్రహ్మసమాజాలు, ప్రార్థన సమాజాలు, ఆర్యసమాజాలు, సార్వజనిక్ సమాజాల గురించే చరిత్ర నిండా నింపినారు. భారతదేశమంతటా ప్రభవించి, కాలం తమకు నిర్దేశించిన కర్తవ్యాలను నెరవేర్చిన అనేక సామాజిక సమాజాలను చరిత్రకు అందకుండా విస్మృతపరిచారు. 


జ్యోతిరావు ఫూలేతో కలిసి సావిత్రిబాయి ఏర్పాటుచేసిన ‘సత్యశోధక సమాజ్’ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిమ్నజాతుల అభివృద్ధి కోసం ప్రభావశీలమైన కృషిని నిర్వహించింది. కులం బలం, పలుకుబడి ఉన్న బ్రాహ్మణ చరిత్రకారులు ఈ వాస్తవాలను పక్కనబెట్టి అసత్యాల, అర్ధసత్యాల చరిత్రను ప్రజల ముందు ఉంచారు. శూద్ర, అతిశూద్ర జాతుల విముక్తికై సత్యశోధక సమాజాన్ని స్థాపించిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే చరిత్రలను ప్రగతిశీల పురుష చరిత్రకారులు, మేధావులు, కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్న వారు సైతం ఎవరూ వెలుగులోకి తీసుకురాలేదు. చివరికి మహిళాసంఘాలు ఫెమినిస్టులు మహిళా చరిత్రకారులు కూడా బ్రాహ్మణ పురుష చరిత్రకారులకు వంత పలికారు. ఇలా ఇంకానా? ఇకపై సాగదు. ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల విద్యావంతులు మరుగునపడిన తమ చరిత్రలను వెలుగులోకి తీసుకొస్తున్నారు.


సావిత్రిబాయి సామాజిక ఉద్యమ నాయకురాలు మాత్రమే కాదు. ఆమె గొప్ప రచయిత్రి. ‘కావ్య ఫూలే’ అనే ఆమె ఖండకావ్య సంపుటి మరాఠీ సాహిత్యంలో సుప్రసిద్ధమయింది. ఇంకా ‘పావన కాశీ సుబోధ్ రత్నాకర్’ మొదలైనవి ఆమెను సాహిత్యవేత్తగా నిలుపుతున్నాయి. సావిత్రిబాయి గొప్ప ఆచరణవాది సమాజ ఆమోదం లేని సంతుని దత్తత తీసుకొని పెంచింది. జ్యోతిబా పూలే మరణించినప్పుడు, మగవాళ్ళే అంతిమసంస్కారాలు చేయాలనే ఆచారాన్ని తృణీకరించి, తనే భర్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన సంఘ ధిక్కారి సావిత్రిబాయి. ఆమె అనేక వ్యతిరేకతలు, ప్రాణాంతక దాడులను ఎదుర్కొని కులాంతర వివాహాలు చేసిన కులనిర్మూలనవాది. అస్పృశ్యులకు తాగునీటి కొరత తీర్చడానికి తన ఇంటి ముందు బావి తవ్వించిన దయామయి. ప్రస్తుత కరోనా విపత్తు వలే 150 సంవత్సరాల క్రితం ప్రబలిన ప్లేగు మహమ్మారి పీడితులకు సేవ చేస్తూ ఆ వ్యాధితోనే మరణించిన గొప్ప సేవామూర్తి సావిత్రి బాయి ఫూలే. ఆమె సాంఘిక సంస్కరణ ఆచరణ, చైతన్య స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం బాధ్యత సమాజంపై ఇంకా మిగిలే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటిల్లో స్టడీ సెంటర్‌లను నెలకొల్పడం తన నైతిక బాధ్యతగా భారత ప్రభుత్వం గుర్తించి సత్వరమే అందుకు పూనుకోవాలి.


-జూపాక సుభద్ర 

(నేడు సావిత్రిబాయి ఫూలే 190వ జయంతి)

Updated Date - 2021-01-03T05:52:46+05:30 IST