Abn logo
Mar 2 2021 @ 01:12AM

ఓటీటీకి నో చెప్పి ప్రేక్షకుల ముందుకొస్తున్నాం

‘‘కొవిడ్‌ వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? రారా? అనే భయంతో మొదట ఓటీటీలో సినిమాను విడుదల చేయాలనుకున్నాం. ‘క్రాక్‌’ నుంచి ‘ఉప్పెన’ వరకూ పరిశ్రమ అందుకున్న విజయాలు చూసి మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఓటీటీకి నో చెప్పి, థియేటర్‌లో విడుదల చేస్తున్నాం’’ అని నాగార్జున అన్నారు. ఆయన ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకుడు. దియా మీర్జా, సయామీ ఖేర్‌ నాయికలు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల తేది పోస్టర్‌ను నాగార్జున ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌, ఇతర ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ పాత్ర స్ఫూర్తి కోసం నేను ఎవరినీ కలవలేదు. దర్శకుడు చెప్పింది చేశానంతే! అడవిలో నాలుగు వైల్డ్‌ డాగ్స్‌ కలిస్తే సింహాలను సైతం చంపే వరకూ విశమ్రించవు. అందుకే ఈ కథకు ఆ టైటిల్‌ పెట్టాం. ఇది పద్దెనిమిది నెలల కష్టం. ఒక ఫైట్‌, కామెడీ సీన్‌, రొమాన్స్‌ ఉంటేనే కమర్షియల్‌ సినిమా అనుకుంటే అలాంటివి మా సినిమాలో ఉండవు. ‘బంగార్రాజు’ సినిమా జూన్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు. ‘‘ఓటీటీకి అమ్మి బయటకొచ్చి థియేటర్‌లో విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే. ఓటీటీకి అమ్మినా, థియేటర్లో విడుదల చేసుకునే అవకాశం ఉంది. సినిమా విడుదలైన 30, 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకొండి అని ఓటీటీ సంస్థ మాకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 10న ట్రైలర్‌ను, ఏప్రిల్‌ 2 సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో నటి సయామీ ఖేర్‌, అలీరెజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement