బస్‌ కాంప్లెక్స్‌లో దిగబెడతానని చెప్పి..

ABN , First Publish Date - 2021-08-09T16:34:46+05:30 IST

బెంగళూరు వెళ్లేందుకు..

బస్‌ కాంప్లెక్స్‌లో దిగబెడతానని చెప్పి..

యువతిని మోసగించిన యువకుడు

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు


గోపాలపట్నం: బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన ఓ యువతిని బస్‌ కాంప్లెక్స్‌లో దిగబెడతానని చెప్పి ఓ యువకుడు మోసం చేశాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పెట్టి బ్యాగ్‌తో పరారయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం క్రైం ఎస్‌ఐ కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన అంజలి బెహరా(26) బెంగళూరులో తన భర్తతో పాటు ఉంటోంది. అయితే తన భర్తతో జరిగిన వివాదం నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆమె నగరానికి వచ్చింది. గతంలో ఆమెకు పరిచయస్థుడైన కల్యాణ్‌ అనే యువకుడు నగరంలో ఉంటున్నాడు. దీంతో అతనితో పాటు ఆమె నగరంలోని ఓ హోటల్‌లో దిగింది. కాగా తిరిగి బెంగళూరు వెళ్లడానికి అంజలి శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రయాణమైంది. ఆమెను అతను స్కూటీపై రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అయితే బెంగళూరు వెళ్లే రైళ్లు లేకపోవడంతో అక్కడ నుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చారు. విమానాలు కూడా లేకపోవడంతో బస్సులో బెంగళూరు వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఆమె బ్యాగ్‌ చిరిగిపోవడంతో దానిని కుట్టించి తీసుకురాల్సిందిగా కల్యాణ్‌ తన మిత్రుడు జాఫర్‌కు చెప్పాడు. దీంతో బ్యాగ్‌ను కుట్టించుకుని జాఫర్‌ నగరం నుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చాడు. విమానాశ్రయం నుంచి ఆమెతో పాటు జాఫర్‌, కల్యాణ్‌లు స్కూటీపై బయలుదేరారు. ఎన్‌ఏడీ జంక్షన్‌ రాగానే కల్యాణ్‌ బండి దిగిపోయాడు. అంజలిని బస్‌ కాంప్లెక్స్‌లో దిగబెట్టమని జాఫర్‌కు చెప్పాడు. అయితే ఆమెను బస్‌ కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లకుండా జాఫర్‌ అడవివరం మార్గంలో తీసుకువెళ్లాడు.


అడవివరం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే మూత్రవిసర్జనకు వెళ్తానని బండి ఆపాడు. ఆమె బండి దిగిన తరువాత బ్యాగ్‌తో సహా ఉడాయించాడు. దీంతో సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు సైట్‌ సెక్యూరిటీ గార్డు వద్దకు ఆమె వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు సాయంతో గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించడంతో అంజలిని శనివారం రాత్రి గోపాలపట్నం తీసుకువచ్చారు. ఆమె గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన బ్యాగ్‌లో రూ.10వేల నగదు, ఒక బంగారు ఉంగరం, గొలుసు ఉన్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదని  పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-08-09T16:34:46+05:30 IST