అదరగొట్టిన ఎస్‌బీఐ

ABN , First Publish Date - 2020-08-01T08:15:00+05:30 IST

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) బంపర్‌ లాభాలు ప్రకటించింది.

అదరగొట్టిన ఎస్‌బీఐ

  • క్యూ1 లాభంలో 81% వృద్ధి 
  • రూ.4,189 కోట్లకు చేరిక 


న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) బంపర్‌ లాభాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ లాభం ఏకంగా 81 శాతం వృద్ధి చెంది రూ.4,189.34 కోట్లకు చేరుకుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో మైనారిటీ వాటా విక్రయం ఇందుకు దోహదపడింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) తగ్గుముఖం పట్టడమూ కలిసివచ్చింది. ఎస్‌బీఐ లైఫ్‌లో 2.1 శాతం వాటా విక్రయం ద్వారా గత త్రైమాసికంలో రూ.1,539.79 కోట్ల ఏక కాల లాభం (వన్‌టైమ్‌ గెయిన్‌) సమకూరినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జూన్‌ కాలానికి బ్యాంక్‌ రూ.2,312.02 లాభాన్ని నమోదు చేసుకుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


- ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలానికి ఎస్‌బీఐ స్టాండ్‌ ఎలోన్‌ ఆదాయం రూ.74,457.86 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే సమయానికి ఆదాయం రూ.70,653.23 కోట్లుగా ఉంది 

- గత మూడు నెలలకు బ్యాంక్‌ నిర్వహణ లాభం 36 శాతం వృద్ధి చెంది రూ.18,061 కోట్లకు పెరిగింది 

- వడ్డీల ద్వారా సమకూరిన ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.66,500 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 3.01 శాతానికి తగ్గింది

- ఈ జూన్‌ చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 5.44 శాతానికి తగ్గాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి గ్రాస్‌ ఎన్‌పీఏలు 7.53 శాతంగా నమోదయ్యాయి

- వార్షిక ప్రాతిపదికన చూస్తే, నికర ఎన్‌పీఏలు 3.07 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గాయి. దాంతో ఎన్‌పీఏల కోసం కేటాయింపులు సైతం రూ.11,648.45 కోట్ల స్థాయి నుంచి రూ.9,420.46 కోట్లకు తగ్గాయి

- కరోనా సంక్షోభంతో ఎన్‌పీఏలుగా మారేందుకు అవకాశమున్న రుణ ఖాతాల కోసం బ్యాంక్‌ ముందుజాగ్రత్త చర్యగా రూ.1,836 కోట్ల అదనపు కేటాయింపులు జరిపింది 

- ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి ప్రత్యేకంగా రూ.1,614 కోట్ల కేటాయింపులు జరిపింది 

- గత త్రైమాసికంలో కొత్తగా రూ.16,212 కోట్ల రుణాలు మొండి పద్దుల్లోకి చేరాయి. కరోనా సంక్షోభ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఎన్‌పీఏలు రూ.63,000 కోట్లకు మించకపోవచ్చు 

- గత త్రైమాసికంలో బ్యాంకు బకాయిల రికవరీలు, అప్‌గ్రెడేషన్‌ రూ.5,769 కోట్లు. వచ్చే రెండు త్రైమాసికాల్లో బడా కార్పొరేట్‌ రుణ ఖాతాల నుంచి రూ.10,000-11,000 కోట్ల మేర రికవరీ అయ్యే అవకాశం ఉంది 

- టర్మ్‌ లోన్‌ బుక్‌ విలువ రూ.16 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 15.96 శాతం పెరిగాయి

- జూన్‌ చివరి నాటికి బ్యాంక్‌ ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి (స్థూల నిరర్థక ఆస్తులు.. వాటి కోసం ఇప్పటివరకు కేటాయింపులు) 86.32 శాతంగా నమోదైంది. అలాగే, బ్యాంక్‌ ఆర్థిక పటిష్టతకు ప్రామాణికమైన క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 13.40 శాతానికి మెరుగుపడింది

- ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 62 శాతం వృద్ధితో రూ.4,776.50 కోట్లకు చేరుకోగా.. కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.87,984.33 కోట్లుగా నమోదైంది 

- సమీక్షా కాలానికి బ్యాంక్‌ రుణ వృద్ధి 6.58 శాతంగా నమోదైంది. అందులో వ్యక్తిగత రిటైల్‌ రుణాలు 12.85 శాతం, విదేశాల్లోని కార్యాలయాలిచ్చిన రుణాలు 11.19 శాతం వృద్ధి చెందాయి

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ రుణ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 10 శాతం నుంచి 8 శాతానికి కుదించుకుంది.  


బ్యాంక్‌ టర్మ్‌ రుణాల్లో 9.5 శాతం మాత్రమే ప్రస్తుతం మారటోరియాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి, ఆగస్టు 31 తర్వాత అన్ని రుణాలకు మారటోరియం అవసరం లేదు. 

- రజనీశ్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌ 


ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఎస్‌బీఐ షేరు దాదాపు 3 శాతం వరకు లాభపడింది. బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో షేరు 4.47 శాతం వరకు బలపడినప్పటికీ.. చివరికి 2.63 శాతం లాభంతో రూ.191.45 వద్ద స్థిరపడింది. 

Updated Date - 2020-08-01T08:15:00+05:30 IST