సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయలేమన్న యూపీఎస్‌సీ

ABN , First Publish Date - 2020-09-28T20:51:36+05:30 IST

సివిల్ సర్వీసు పరీక్షలను ఇంకెంతమాత్రం వాయిదా వేయడం సాధ్యం కాదని యూనియన్ పబ్లిక్..

సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయలేమన్న యూపీఎస్‌సీ

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసు పరీక్షలను ఇంకెంతమాత్రం వాయిదా వేయడం సాధ్యం కాదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సోమవారంనాడు సుప్రీంకోర్టుకు తెలిపింది. సివిల్ సర్వీసెస్ (ప్రిమిల్స్) పరీక్షలు-2020 వాయిదా వేయాలంటూ యూపీఎస్‌సీ అభ్యర్థులు పలువురు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీఎస్‌సీ తన వాదనకు సంబంధించిన అఫిడవిట్‌ను మంగళవారంనాడు సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.


యూపీఎస్‌సీ తరఫున హాజరైన అడ్వకేట్ నరేష్ కౌషిక్... ఎంతమాత్రం పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు. 'ఈ అంశాన్ని పరీశీలించి వాయిదా వేయడం కూడా జరిగింది. వాయిదా వేస్తూ పోవడం వల్ల పరీక్షల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుంది. నిజానికి సెప్టెంబర్ 30న అనుకున్నప్పటికీ అక్టోబర్ 4కు వాయిదా వేశాం' అని కౌశిక్ వాదించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ, పరీక్షలు ఎందుకు వాయిదా వేయరాదో, ఇందుకు సహేతుకమైన కారణాలేమిటో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది.


దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో పరీక్షలు రెండు, మూడు నెలల పాటు వాయిదా వేయాలని సుమారు 20 మంది యూపీఎస్‌సీ అభ్యర్థులు తమ పిటిషన్‌‌లో కోరారు. 7 గంటల సేపు జరిగే ఆఫ్‌లైన్ పరీక్షలో దేశవ్యాప్తంగా 72 నగరాల్లో ఆరు లక్షల మంది హాజరవుతున్నారని, ఇందువల్ల దేశంలో కోవిడ్-19 మరింత విస్తరించే అవకాశాలున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి తరఫున న్యాయవాది శ్రీవాత్సవ కోర్టులో వాదన వినిపించారు.

Updated Date - 2020-09-28T20:51:36+05:30 IST