కన్వర్ యాత్రపై యూపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం

ABN , First Publish Date - 2021-07-16T21:11:04+05:30 IST

కన్వర్ యాత్ర నిర్వహించాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన..

కన్వర్ యాత్రపై యూపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం

న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర నిర్వహించాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించేందుకు యోగి సర్కార్‌కు చివర అవకాశం ఇచ్చింది. దేశ ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. యాత్ర నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, లేదంటే కోర్టే స్వయంగా వచ్చే సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.


''దేశ ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు అన్నింటికంటే ముఖ్యం. మిగతా సెంటిమెంట్లన్నీ ఆ తరువాతే'' అని యూపీ ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ నారిమన్ అన్నారు. దీనిని కాదని యూపీ ప్రభుత్వం 100 శాంతం ముందుకు వెళ్లజాలదు'' అని వ్యాఖ్యానించారు. కోర్టు అభిప్రాయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, అనంతరం కోర్టు ముందు నివేదిస్తామని యూపీ ప్రభుత్వ అడ్వేకేట్ సీఎస్ వైద్యనాథన్ పేర్కొన్నారు. కఠినమైన ఆంక్షలు, తక్కువ మంది భక్తులతో యాత్రను సింబాలిక్ తరహాలో అనుమతించాలని  అనుకున్నామనీ, దీనిపై స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ సంప్రదింపులు జరిపిందని అన్నారు. మతపరమైన కారణాల రీత్యా కన్వర్ యాత్రలో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే అనుమతి తీసుకోవాల నెగిటివ్ ఆర్‌టీ-పీసీఆర్  టెస్ట్, వ్యాక్సినేషన్ వేయించుకోవడం తప్పనిసరని స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ పేర్కొన్నట్టు చెప్పారు. యాత్రపై సంపూర్ణ నిషేధం సరికాదని యూపీ సర్కార్ భావిస్తోందన్నారు. కాగా, యాత్రను పూర్తిగా నిషేధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉత్తరాఖండ్ తరఫున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలిపారు.


కాగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా స్థానిక శివాలయాల్లో అభిషేకానికి హరిద్వార్ నుంచి గంగా జలాలను సేకరించాలనుకునే కన్వరీలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించరాదని అన్నారు. కన్వర్ యాత్రకు అనుమతిస్తూ యూపీ సర్కార్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది.

Updated Date - 2021-07-16T21:11:04+05:30 IST