ఎస్సీ రైతులకు భూమిపై హక్కులు

ABN , First Publish Date - 2021-07-31T05:57:07+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇచ్చిన భూములపై సర్వహక్కులు లభించనున్నారు.

ఎస్సీ రైతులకు భూమిపై హక్కులు

ఏళ్ల తర్వాత పరిస్కారమైన సమస్య

కార్పొరేషన్‌ ద్వారా భూముల కొనుగోలు

ఇంతవరకు తనఖాలోనే.. ఇప్పుడు బదలాయింపు

ఒంగోలు నగరం, జూలై 30 : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇచ్చిన భూములపై సర్వహక్కులు లభించనున్నారు. అందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు.  ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 30 ఏళ్లుగా భూమి కొనుగోలు పథకం అమలవుతోంది. ఒక్కో ఏడాది   ఒక్కో విధంగా ప్రభుత్వం యూనిట్‌ విలువను నిర్ణయించి లబ్ధిదారులకు భూములను కొనుగోలు చేసి ఇచ్చింది. భూమి కొనుగోలు చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు రుణంగా చూపిస్తోంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు తిరిగి చెల్లించే వరకు ఆ భూములను రైతుల ద్వారా కార్పొరేషన్‌కు మార్టిగేజ్‌ చేసుకుని ఉంచుకుంటున్నారు. అయితే 90శాతం మంది రుణం తిరిగి తీర్చకపోవటంతో నేటికీ ఆ భూములు కార్పొరేషన్‌కు తనఖాలోనే ఉన్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోకముందు చివరిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ రద్దు చేసేసింది. దీంతో భూమి కొనుగోలు కింద భూములు పొందిన రైతుల రుణాలు కూడా పూర్తిగా రద్దయిపోయాయి. వాటిని తనఖా నుంచి తప్పించి వారి భూమి పత్రాలను వారికి ఇవ్వాల్సిన ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఇంత వరకు పట్టించుకోలేదు. దీంతో ఆయా రైతులు అనేక ప్రభుత్వ పథకాలను దూరమయ్యారు. ప్రభుత్తం అమలుచేస్తున్న రైతు భరోసా, ఇతర పథకాలు అందలేదు. భూముల పత్రాలు కార్పొరేషన్‌ తనఖాలో ఉండటంతో వీరు అర్హత సాధించలేకపోయారు. 


4200 మందికి 3700 ఎకరాలు

జిల్లాలో ఇంకా 4,200 మంది ఎస్సీ రైతులకు 3,700 ఎకరాల భూములు ఎస్సీ కార్పొరేషన్‌కు మార్టిగేజ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములన్నింటినీ ఎస్సీ రైతులను అందజేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి వివరాలు తెప్పించుకున్నారు. ఈ విషయమై ఈడీ శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్సీ రైతుల భూములకు సంబంధించిన పత్రాలను అందజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 

Updated Date - 2021-07-31T05:57:07+05:30 IST