ఆశీలు వసూలులో మహా మాయ

ABN , First Publish Date - 2021-07-30T05:46:58+05:30 IST

పూర్ణామార్కెట్‌ ఆశీలు వసూలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆశీలు వసూలులో మహా మాయ

పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో ఏడాదిన్నరపాటు ఇష్టారాజ్యం

కాంట్రాక్టర్‌ వదిలేయడంతో ప్రైవేటు వ్యక్తులతో వసూలు చేయించిన అధికారి

వసూలైన మొత్తంలో సగానికి పైగా నొక్కేసినట్టు ఆరోపణలు

లెక్కలు అడిగితే చెప్పేందుకు ముఖంచాటేస్తున్న వైనం

లోతుగా విచారణ చేస్తే భారీ కుంభకోణం వెలుగుచూస్తుందంటున్న సిబ్బంది


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పూర్ణామార్కెట్‌ ఆశీలు వసూలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా అక్కడ ఆశీలు వసూలుకు వేలం నిర్వహించలేదు. నెల కిందటే వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అంతకుముందు...జీవీఎంసీ రెవెన్యూ సిబ్బందే ఆశీలు వసూలు చేయాల్సి ఉన్నా, అధికారులు కావాలనే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కొద్దోగొప్పో వసూలైనట్టు లెక్క చూపించి...మిగిలిన మొత్తాన్ని వాటాలు వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.


జీవీఎంసీ జోన్‌-4లో గల పూర్ణామార్కెట్‌లో సుమారు 150 దుకాణాలు ఉన్నాయి. వీటితోపాటు రోడ్డు వెంబడి తాత్కాలిక షెడ్లు, తోపుడుబండ్లపై కూడా విక్రయాలు జరుగుతంటాయి. ఆయా దుకాణాల స్థాయిని బట్టి రోజుకు రూ.20 నుంచి రూ.200 వరకూ ఆశీలు కట్టాల్సి ఉంటుంది. ఇవికాకుండా మార్కెట్‌కు సరకు తెచ్చే, తీసుకువెళ్లే వాహనాలు రోజుకు రూ.50 చొప్పున చెల్లించాలి. అలాగే మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులు ద్విచక్ర వాహనానికి, కారుకు ఆశీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆశీలు వసూలుకు జీవీఎంసీ ఏటా వేలం నిర్వహిస్తుంటుంది. 2018-19లో రూ.80 లక్షలకు వెళ్లగా, 2019-20లో రూ.1.2 కోట్లకు పాట పాడారు. అయితే రూ.1.2 కోట్లకు పాడిన కాంట్రాక్టర్‌ మధ్యలోనే వదిలేయడంతో జీవీఎంసీయే ఆ బాధ్యత చేపట్టాల్సి వచ్చింది. జోన్‌-4 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ముగ్గురేసి ఉద్యోగులు బ్యాచ్‌ల వారీగా మార్కెట్‌కు వెళ్లి ఆశీలు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఆశీలు కాంట్రాక్టు మధ్యలో వదిలేసిన వ్యక్తి కుటుంబసభ్యుడొకరు రెవెన్యూ విభాగంలో కీలకంగా వ్యవహరించే ఒక అధికారిని కలిసి ఆశీలు వసూలుపై డీల్‌ కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. తన మనుషులతోనే ఆశీలు వసూలు చేయిస్తానని, మొత్తంలో కొంత అధికారికంగా చూపించి, మిగిలింది వాటాలు వేసుకుందామని సదరు ప్రైవేటు వ్యక్తి ప్రతిపాదించగా...జీవీఎంసీ అధికారి ఓకే చెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులకు పదేపదే ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వేలం పాట నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే కేవలం రూ.50 లక్షలకు మాత్రమే పాట జరిగినట్టు ఫైల్‌ తయారుచేసి కమిషనర్‌ ఆమోదానికి పంపగా...ఆమె తిరిగి వెనక్కిపంపేశారు. ఏటేటా వేలం మొత్తం పెరగాల్సింది పోయి, గతంలో కంటే సగం తక్కువకు ఎలా ఇస్తారని, మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో నెలరోజుల కిందట వేలం నిర్వహించి, రూ.82.5 లక్షలకు పాట ఖరారు చేసి, కౌన్సిల్‌లో ఆమోదించారు.  


ఏడాదిన్నపాటు కలెక్షన్‌కు లెక్కలేవి?


దాదాపు ఏడాదిన్నరపాటు జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఆశీలు వసూలు చేశారు.  మార్కెట్‌లో అన్ని కేటగిరీల నుంచి రోజుకు కనీసం రూ.30 వేల వరకూ ఆశీలు వసూలవుతుంది. డిపార్ట్‌మెంటల్‌ కలెక్షన్‌ జరిగినప్పుడు ఆ స్థాయిలోనే జీవీఎంసీకి ఆదాయం సమకూరాలి. కానీ రోజుకు రూ.5-10 వేలు మధ్యలోనే వసూలైనట్టు రికార్డుల్లో నమోదుచేసినట్టు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని రెవెన్యూ విభాగంలో కీలకంగా వ్యవహరించే ఒక అధికారి తన సమక్షంలోనే వాటాలు వేసి సిబ్బందితోపాటు తనపై అధికారులు, ఆశీలు వసూలు చేయించిన ప్రైవేటు వ్యక్తులకు పంచేవారని తెలిసింది.    డిపార్టుమెంటల్‌ కలెక్షన్‌ జరిగిన కాలంలో వచ్చిన ఆదాయం వివరాలను జోన్‌-4 రెవెన్యూ విభాగం అధికారులను గత వారంరోజులుగా అడిగితే...సమావేశాలు, క్షేత్ర స్థాయి పర్యటనలు, ఇతర పనుల్లో బిజీగా వున్నామంటూ దాటవేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపితే కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడుతుందని సిబ్బంది అంటున్నారు.

Updated Date - 2021-07-30T05:46:58+05:30 IST