షీ టీంలో ఫిర్యాదుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌

ABN , First Publish Date - 2021-04-20T05:37:58+05:30 IST

సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వేధింపులకు గురవుతున్న మహిళలు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చునని సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. షీ టీం విభాగం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ కంప్లయింట్‌ పోస్టర్లను సోమవారం కమిషనర్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

షీ టీంలో ఫిర్యాదుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌
క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీపీ జోయల్‌ డేవిస్‌

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 19: సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వేధింపులకు గురవుతున్న మహిళలు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా సులభంగా ఫిర్యాదు  చేయవచ్చునని సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. షీ టీం విభాగం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ కంప్లయింట్‌ పోస్టర్లను సోమవారం కమిషనర్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లను సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రధాన కూడళ్లతో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సినిమాథియేటర్స్‌, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. మహిళలు తమ స్మార్ట్‌ ఫోన్‌లో క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ యాప్‌ ద్వారా షీ టీం ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌న్‌ స్కాన్‌ చేస్తే వెబ్‌సైట్‌కు అనుసంధానం అవుతుందన్నారు. ఈ సైట్‌లోని ఫారంలో బాధితులు తమ పూర్తి వివరాలతో పాటు వారి ప్రస్తుత లోకేషన్‌ పూరించి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి వుంటుందన్నారు. ఫిర్యాదులపై కమిషనరేట్‌తో పాటు షీ టీం ఐటీ విభాగంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే సంబంధిత షీ టీం స్పందించి, మహిళలను రక్షిస్తుందని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, మహిళా ఎస్‌ఐ భూలక్ష్మి, కానిస్టేబుళ్లు స్రవంతి, రజనీ, రవి  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-20T05:37:58+05:30 IST