టీకాకు కటకట!

ABN , First Publish Date - 2021-04-08T07:11:53+05:30 IST

రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్‌చైన్‌ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి.

టీకాకు కటకట!

కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ కొరత ఆరోగ్యశాఖను తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రానికి సరిపడా డోస్‌లు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. దీంతో మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ అందుతుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 


  • -రాష్ట్రంలో ముంచుకొస్తున్న కొరత.. రెండో డోస్‌ డౌటే?
  • -4 లక్షలకు పడిపోయిన నిల్వలు.. కోటి డోస్‌లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • -ఆ స్థాయిలో ఇవ్వలేమన్న కేంద్రం.. అత్యవసరంగా 3 లక్షల డోస్‌లకు ఓకే
  • -15నాటికి 10 లక్షల కొవిషీల్డ్‌ డోసులు.. ఇప్పట్లో అంతకుమించి ఇవ్వలేం 
  • -కేంద్రం స్పష్టీకరణ.. ఆదిలో మార్గదర్శకాలు పట్టని రాష్ట్ర ఆరోగ్య శాఖ
  • -అడ్డగోలుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. లక్షలాదిగా డోస్‌లు వృథా 
  • -కొరతతో కొన్ని టీకా కేంద్రాలు మూసేయాల్సి రావచ్చు: మహారాష్ట్ర
  • -ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్‌చైన్‌ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా కోటి డోస్‌ల వ్యాక్సిన్‌ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఏపీతో పోలిస్తే మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున వారిని కాదని కోటి డోస్‌లు ఇవ్వలేమని, అత్యవసరంగా 3లక్షల డోస్‌లు మాత్రమే సరఫరా చేస్తామని తేల్చిచెప్పింది. ఏప్రిల్‌ 15తర్వాత మరో 10లక్షల డోస్‌లు పంపుతామని స్పష్టం చేసింది. దీంతో ఇటు ప్రభుత్వం, ఆటు ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు లక్ష మందికి టీకా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4లక్షల డోస్‌లు, కేంద్రం ఇవ్వనున్న 3లక్షల డోస్‌లతో కొన్ని రోజులు కాలం వెళ్లబుచ్చినా, ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముంచుకొస్తున్న వ్యాక్సిన్‌ కొరత అధికార, వైద్యవర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 


కేంద్రం సూచనలు గాలికి...

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోస్‌ వేయడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. సరిపడా నిల్వలు అందుబాటు లేకపోవడం, కేంద్రం కూడా చేతులెత్తేయడంతో ఆరోగ్యశాఖకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు చేస్తూనే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిదానంగా చేయాలని, సరఫరా చేసిన డోస్‌ల ఆధారంగానే ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలని సూచిస్తూ వచ్చింది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు ఈ సూచనలు గాలికి వదిలేశారు. కేంద్రం మార్గదర్శకాలను బుట్టదాఖలు చేసి సొంత నియమాలతో వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. టీకా వేయించుకోకపోతే కష్టమని ఊదరగొట్టి, ప్రజలను భయాందోళలనకు గురిచేసి మరీ వ్యాక్సిన్‌ వేయించారు. ఇప్పుడు నిల్వలు నిండుకోవడంతో తప్పంతా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి డోస్‌ వేయించుకున్న వారు రెండో డోస్‌ వేయించుకోకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 


నిబంధనలు బేఖాతరు

కేంద్ర ప్రభుత్వం జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. నిల్వలు తక్కువగా ఉన్నందున 135- 150 వరకూ వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, ప్రతి కేంద్రంలో వంద మందికి మించి టీకా వేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలన్న ఉద్దేశంతో తొలిరోజు నుంచే 350 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ కేంద్రాల సంఖ్య పెంచుకుంటూ చివరికి గ్రామ సచివాలయాల్లోనూ టీకా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం వంద డోస్‌ల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే తొలి విడతలో 45మందికి టీకా వేయాలి. మరో 45 డోస్‌లు అదే లబ్ధిదారులకు రెండో డోస్‌ కోసం భద్రపరచాలి. మిగిలిన 10 డోస్‌లు వృథాగా పరిగణిస్తారు. ఆరోగ్యశాఖ ఈ నిబంధనను పట్టించుకోలేదు. రాష్ట్రానికి వచ్చిన మొత్తం డోస్‌లను తొలి విడతలోనే ఎక్కువమందికి అందించారు. రెండో డోస్‌ గురించి ఆలోచించలేదు. కేంద్రం హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ముందస్తు ప్రణాళికలు లేకుండా తొలినుంచి చేసిన తప్పిదాలే నేడు రెండో డోస్‌ అందుబాటులో లేకపోవడానికి కారణంగా మారాయి.


2.53 లక్షల డోస్‌లు వృథా 

ఇప్పటివరకూ రాష్ట్రంలో 31.84 లక్షల మందికి ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ వేసింది. ఇందులో 5.78లక్షల మందికి కొవాగ్జిన్‌, 26.06 లక్షల మందికి కొవిషీల్డ్‌ వేశారు. దీనికోసం 34.37లక్షల డోస్‌లు ఉపయోగించారు. ఈ లెక్క ప్రకారం 2.53 లక్షల టీకా డోస్‌లు వృథా అయినట్లే. దేశంలో ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్‌ వృథా చేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యాక్సిన్‌ వైల్‌లో 10 లేదా 20 డోస్‌లుంటాయి. 10డోస్‌ల వైల్‌ తెరవాలంటే కనీసం 9మంది, 20డోస్‌ల వైల్‌ ఓపెన్‌ చేయాలంటే కనీసం 17నుంచి 18మంది టీకా వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యశాఖ ఈ నిబంధనలు పక్కనపెట్టింది. ఇద్దరు, ముగ్గురున్నా వైల్‌ ఓపెన్‌ చేసేశారు. అందువల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్‌ వృథా అయిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించి ఉంటే రెండో డోస్‌ సమస్య వచ్చేది కాదని, ఈ స్థాయిలో వృథా అయ్యేది కాదని స్పష్టం చేస్తున్నారు. 


కొవాగ్జిన్‌ కష్టమే 

ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్‌ వరకూ ప్రతి ఒక్కరూ కొవాగ్జిన్‌ వేయించుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పట్టుబట్టి మరీ దాన్నే తీసుకున్నారు. దీంతో ప్రజలంతా కొవాగ్జిన్‌ మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి కేంద్రం 8.14 లక్షల డోస్‌లు మాత్రమే కొవాగ్జిన్‌ సరఫరా చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారే 4లక్షల మందికి పైగా ఉన్నారు. కానీ 1.67 లక్షల కొవాగ్జిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలినవారికి రెండో డోస్‌ ఎలా వేయాలంటూ ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి అత్యవసరంగా ఇస్తామన్న డోసులు కూడా కొవిషీల్డ్‌ మాత్రమే పంపిస్తామని, ఇప్పుడు కొవాగ్జిన్‌ ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేసింది. దీంతో రెండో డోస్‌ కొవాగ్జిన్‌ వేయించుకోవాల్సిన వారి పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది. 

Updated Date - 2021-04-08T07:11:53+05:30 IST