విచ్చలవిడిగా మట్టి తోలకాలు

ABN , First Publish Date - 2020-07-14T11:18:30+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో ఏదో ఒక చోట నిత్యం మట్టి తోలకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ జేసీబీలతో

విచ్చలవిడిగా మట్టి తోలకాలు

సత్తుపల్లిరూరల్‌, జులై 12: మండలంలోని పలు గ్రామాల్లో ఏదో ఒక చోట నిత్యం మట్టి తోలకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ జేసీబీలతో వందలాది ట్రాక్టర్లతో మట్టిని అమ్ముకుంటూ స్థానికంగా ఉండే దళారులు ఒకొక్కక్క ట్రాక్టర్‌కు రూ.300నుంచి రూ.600వరకు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


నిత్యం మట్టి తోలకాలు జరుగుతున్నప్పటికీ స్థానికులు సంబందిత రెవెన్యూ, ఐబీ అధికారులకు సమాచారం ఇచ్చినా చూసీచూడనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని ప్రజలు మట్టిని ఇళ్లలోకి అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఫ్యాక్టరీలు, భవనాలకు మట్టి అవసరం ఎక్కువగా ఉండటంతో వందలాది ట్రాక్టర్ల మట్టిని ఇదే అదునుగా భావించి దళారులు అమ్ముకుంటున్నారు. అక్రమార్కులు మట్టిని సహజ వనరులు, చెరువులు, గుట్టలు కనుమరుగయ్యేలా చేస్తున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం తమకు సంబందం లేనట్లుగా ఉండటం విశేషం. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, ఐబీ అధికారులు దృష్టి సారించకపోవడం వల్లనే అక్రమార్కులు మట్టిన విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


ఒకవేళ ప్రజలు ఒత్తిడి మేరకు మట్టిని అక్రమంగా తరలించే ప్రదేశానికి వచ్చిన అధికారులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా తమకు ఏమీ సమాచారం లేదని, ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.


ప్రభుత్వ అవసరాలు మట్టి తోలకాలు

మట్టిని తరలించే క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, అర్బన్‌పార్క్‌, ఇతర అవసరాలకు మట్టి తోలుతున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ తతంగం ఏళ్లకు ఏళ్లు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, గుట్టలు, వాగులు, రైతుల పొలాలు, ఖాళీ ప్రదేశాలో రాత్రీపగలూ తవ్వకాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-14T11:18:30+05:30 IST