12 రోజులు వెనక్కి..!

ABN , First Publish Date - 2020-10-28T16:53:41+05:30 IST

టీచర్ల సాధారణ బదిలీల షెడ్యూల్‌ను సవరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగినప్పటికీ, ఆ వివరాలు చైల్డ్..

12 రోజులు వెనక్కి..!

టీచర్ల బదిలీల రీ షెడ్యూల్‌కు విద్యాశాఖ అంగీకారం

రేషనలైజేషన్‌ పరిగణనలోకి 

నవంబరు 2 వరకూ చేరే విద్యార్థుల వివరాలు


ఏలూరు: టీచర్ల సాధారణ బదిలీల షెడ్యూల్‌ను సవరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగినప్పటికీ, ఆ వివరాలు చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో ఆన్‌లైన్‌ చేయలేదన్న కారణంతో పాఠశాలల నుంచి టీచర్‌ పోస్టులను తొలగిస్తుండడంపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నుంచి ఎదురైన నిరసన, వ్యతిరేకతకు విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మంగళవారం ఫ్యాప్టో ప్రతినిధులతో విద్యాశాఖ అధికారులు జరిపిన చర్చల్లో కీలక సమస్యల పరిష్కారానికి అంగీకారం తెలపడంతో బదిలీల షెడ్యూల్‌ సవరణకు మార్గం సుగమమైంది. సవరించిన బదిలీల షెడ్యూల్‌ను విద్యా శాఖ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. తొలుత నిర్ధేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29 నుంచి హెచ్‌ఎంలు, టీచర్లు బదిలీ స్థానాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, మంగళవారం జరిగిన చర్చల పర్యవసానంగా 12 రోజుల పాటు వెనక్కు వెళ్లనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ ప్రామాణిక తేదీని పొడి గించడం, ఆ మేరకు చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదుకు పలు సడలింపులు ఇవ్వడంతో జిల్లాలో ఇప్పటికే గుర్తించిన సర్‌ప్లస్‌ టీచర్ల సంఖ్య ఒకింత తగ్గనుంది. 


సమస్యల పరిష్కారం ఇలా..

జూ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ జరిగిన వివరాలతోపాటు, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన బాలబాలికల వివరాలను చైల్డ్‌ ఇన్‌ ఫో డేటాలో నమోదు చేసేందుకు నెలకొన్న సాంకేతిక అవరోధాలపై పరిష్కారం లభించింది. ఆ ప్రకారం కొత్తగా నవంబర్‌ 2వ తేదీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల ఆధార్‌, పేరెంట్‌ డిక్లరేషన్లను సంబంధిత ఎంఈవోకు ప్రధానోపాధ్యాయులు అందజేయాలి. అలా చేరిన ప్రైవేటు విద్యార్థుల టీసీలను చైల్డ్‌ ఇన్‌ఫో డ్రాప్‌ బాక్సులో వేసే బాధ్యత ఎంఈవోలదే.


సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ)లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ స్థానాలను ఎంచుకునే ప్రక్రియ నిర్వహణపై పది రోజుల్లోగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు డెమో ద్వారా చూపిస్తారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపై ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే స్వీకరిస్తారు. డెమో అనంతరం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌పై సుముఖత వ్యక్తం కాకపోతే మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ అంశాన్ని పరిశీలిస్తారు. 


ఒకే స్కూలులో ఐదు విద్యా సంవత్సరాలు (అకడమిక్‌ ఇయర్స్‌) పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నిబంధన వల్ల ప్రస్తుతం నాలుగున్న రేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు తప్పనిసరి బదిలీ కోవలోకి వస్తున్నందున నష్టపోతున్నట్లు ఫ్యాప్టో ప్రతినిధులు విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య పరిష్కారానికి హెచ్‌ఎం సంబంధిత స్కూల్‌లో జాయిన్‌ అయిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని సర్వీసును నిర్ణయిస్తారు.


ఇటీవల అడ్‌హక్‌ పదోన్నతులు పొందిన హెచ్‌ఎంలు, టీచర్లకు బదిలీ స్థానాలను కేటాయించేందుకు సానుకూలత వ్యక్తమైంది. ఆ ప్రకారం సాధారణ బదిలీల్లో భాగంగా తొలుత హెచ్‌ఎంల బదిలీలు పూర్తయిన వెంటనే ఇటీవల పదోన్నతి పొందిన హెచ్‌ఎంలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాలను కేటాయిస్తారు. ఆ మేరకు వేకెన్సీ జాబితాలో కొత్తగా చేరే బదిలీ స్థానాలను స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి పొందిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాలను కేటాయిస్తారని ఫ్యాప్టో నాయకులు వెల్లడించారు. ఈ నిర్ణయాలన్నింటిపైనా విద్యా శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది.


Updated Date - 2020-10-28T16:53:41+05:30 IST