Abn logo
Sep 14 2021 @ 00:57AM

పాఠశాలల్లో ఎన్నికల సందడి

తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ

జిల్లాలో 4,403 పాఠశాలలకు 16న నోటిఫికేషన్‌

22న పోలింగ్‌, అదేరోజు ఫలితాల ప్రకటన

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 13:న్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు మినహా జిల్లాలోని 4,403 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ మేరకు సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ కమిషనరు కార్యాలయాలు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశాయి. జిల్లాలో 3,384 ప్రాథమిక, 330 మాధ్యమిక, 689 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయని సమగ్ర శిక్షా సీఎంవో వై.శివరామకృష్ణయ్య తెలిపారు. ఈ ప్రకారం ఈ నెల 22న పేరెంట్స్‌ కమిటీలను ఎన్నిక ద్వారా నియమించి మొదటి సమావేశం నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. 

పాఠశాలల్లో ప్రస్తుతమున్న కమిటీల పదవీ కాలం అక్టోబరుతో ముగియనుండటంతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల హడావుడి మొదలైంది.

16వ తేదీ ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, సభ్యుల ఎన్నికకు అదే రోజున నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటరు జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. 

దానిపై 21వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో పెడతారు.

22వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత తొలి సమావేశం జరుపుతారు. 

నాడు-నేడు పనులకు ప్రభుత్వం విడుదల చేసే నిధులను నూతన కమిటీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాలకవర్గాల పదవీకాలానికి ముందే ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీలతో పనులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


ఏర్పాట్లు చేస్తున్నాం 

పేరెంట్స్‌ కమిటీల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే సమాచారం ఇచ్చాం. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసుల  సహకారం పొందాలని ఆదేశించాము.

ఎస్‌.అబ్రహం, డీఈవో