సిలబస్‌ తగ్గిస్తేనే ‘ఫలితం’..!

ABN , First Publish Date - 2021-01-21T06:55:05+05:30 IST

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సిలబస్‌ తగ్గిస్తేనే ‘ఫలితం’..!

లేకుంటే ‘పది’ విద్యార్థుల్లో ఉత్తీర్ణత తగ్గే అవకాశం

ప్రభుత్వానికి  ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం బాగానే ఉన్నప్పటికీ, పాఠ్యాంశాల విషయంలో కొంత సడలింపులు చేయాల్సిన అవసరముందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. మరో నాలుగు నెలల్లో నిర్వహించనున్న వార్షిక పరీక్షల్లో పూర్తి సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తే విద్యార్థులు రాసే పరిస్థితి ఉండదని, ఫలితంగా ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం 70 శాతానికి పడిపోయే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష బోధనలు ప్రారంభిస్తున్న తరుణంలో సిలబస్‌, మార్కుల విధానంపై స్పష్టతనివ్వాలని వారు కోరుతున్నారు.

60 శాతం తగ్గించాలి..


పదో తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో 60 శాతం పాఠ్యాంశాలను తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచి చెప్పే పాఠాల్లోని ప్రశ్నలను మాత్రమే వార్షిక పరీక్షల్లో ఇవ్వాలని కోరుతున్నారు. 

‘ఆన్‌లైన్‌’కు అంతర్గత మార్కులు ఇవ్వాలి 


9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో బడుల్లో జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్‌ కారణంగా పది నెలల క్రితం తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని గదులు, మరుగుదొడ్లను రోజూ శుభ్రం చేయించాలి.  టేబుళ్లు, బెంచీలను శానిటైజ్‌ చేయించాలి. ప్రధానంగా పదో తరగతిలో ఇప్పటివరకు జరిగిన ఆన్‌లైన్‌ క్లాసులకు ఇంటర్నల్‌ మార్కులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు తరగతులు నిర్వహించాలి. 6 పేపర్లలోనే పరీక్షలు పెట్టాలి.  

ముత్యాల రవీందర్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

50 శాతం మార్కులకే ప్రశ్నలు..

కొవిడ్‌ కారణంగా పదో తరగతి విద్యార్థులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. ఆన్‌లైన్‌ క్లాసులు చాలామందికి అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. వార్షిక పరీక్షలు ఎలా రాయాలనే దానిపై ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మే నెలలో నిర్వహించే వార్షిక పరీక్షల్లో 50 శాతం మార్కులకే ప్రశ్నలు అడగాలి.  

శ్యామ్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలి 

క్లాసులు ప్రారంభించక ముందే విద్యార్థులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. పాఠశాలల్లో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం ఇవ్వాలి. కార్పొరేట్‌, ప్రైవేట్‌ బడుల్లో అధిక ఫీజులను అరికట్టాలి. 

నాగరాజు, ఎస్‌ఎ్‌ఫఐ, రాష్ట్ర కార్యదర్శి

విద్యాసంస్థలు జాగ్రత్తలు

పాటించాలి : తలసాని 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 1నుంచి 9, 10 తరగతులు, ఇంటర్‌, డిగ్రీ తరగతుల నిర్వహణ కోసం విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం అనుమతించడంతో బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మంత్రి తలసాని మాట్లాడుతూ కచ్చితంగా విద్యార్థులు మాస్క్‌లు ధరించేలా చూడాలని, శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. తరగతి గదుల్లో కనీస దూరం పాటించేలా ఏర్పాట్లు  చేయాలని, టాయిలెట్స్‌ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే లా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని, సకాలంలో నిధులు రాని కారణంగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని కొందరు వివరించారు. 

సమావేశం తర్వాత మంత్రి తలసాని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభించడానికి ముందే, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ శ్వేతా మహంతి, అడిషనల్‌ కమిషనర్‌ సంతోష్‌, రోహిణి, ఇంటర్‌ బోర్డ్‌ అధికారి జయప్రదలు పాల్గొన్నారు. 80 శాతం ప్రభుత్వ పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ఆ భవనాలకు ప్రాపర్టీట్యాక్స్‌ రద్దు చేయాలని కొందరు మంత్రిని కోరారు. 

Updated Date - 2021-01-21T06:55:05+05:30 IST