బడికి... ఇంటి భోజనం

ABN , First Publish Date - 2021-12-08T05:48:39+05:30 IST

డిమాండ్ల సాధన కోసం మధ్యాహ్న భోజన నిర్వాహకులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 499 పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు 880 మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

బడికి... ఇంటి భోజనం
ముస్తాబాద్‌లో ఇంటినుంచి టిఫిన్‌ బాక్స్‌లు తెచ్చుకున్న విద్యార్థినిలు

- కొనసాగుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమ్మె

- ఉపాధ్యాయులు వంట చేయవద్దని కార్మికుల వినతి 

- కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులతో మధ్యాహ్న భోజనం

- జిల్లాలో 499 ఏజెన్సీలు.. 880 మంది నిర్వాహకులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

డిమాండ్ల సాధన కోసం మధ్యాహ్న భోజన నిర్వాహకులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 499 పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు 880 మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బందులు ఎదురవుతున్నా భోజనం యధావిధిగా అందిస్తున్నారు. నిర్వహణ భారంతో సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెబాట పట్టారు. సెప్టెంబరు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 499 ఏజెన్సీలకు రూ 2.33 కోట్ల బకాయిలు ఉన్నాయి.  నిధులు విడుదల చేయడంతో పాటు కనీస వేతనం అమలు చేయాలని గ్యాస్‌ సిలెండర్‌, కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలని, వంటఛార్జీలు పెంచాలని, కిరాణా సరుకులు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ. 4.97 పైసలు, 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.7.47 పైసలు, 9, 10విద్యార్థులకు రూ 9.45 పైసలు అందిస్తున్నారు. వీటి ద్వారా వంట నూనెలు, పప్పులు, గ్యాస్‌, ఇతర సరుకులు కొనలేని పరిస్థితి ఉందని అందోళన చెందుతున్నారు. 

ఆందోళనలు ఉధృతం

 మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో భాగంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో నిరసనలు తెలపడంతో పాటు మంగళవారం జిల్లా కేంరద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌కు తరలివెళ్లి డీఈవో కు వినతిపత్రం అందించారు. మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుండి బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు ప్రైవేటు వ్యక్తులకు రూ. 250 చొప్పున ఇస్తున్నారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులే వంట చేశారు. సిరిసిల్లలో ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఇంటి వద్దే భోజనం తయారు చేసి తీసుకవచ్చి విద్యార్థులకు వడ్డించారు. మధ్యాహ్న భోజనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలో వంట చేస్తున్న ఉపాధ్యాయుల వద్దకు నిర్వాహకులు వెళ్లి వంట చేయవద్దని తమ సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిరిసిల్లలో ఒక పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులు వంట చేస్తుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు వంట చేయమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులే వంట చేశారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టి వంట చేస్తే తరువాత ఏజెన్సీ పోతుందేమోనని భయపడుతున్నారు. దీంతో కొందరు సమ్మెలోకి వెళ్లడానికి భయపడుతున్నట్లు తెలిసింది. మరికొందరు చాలీచాలనీ డబ్బులతో మధ్యాహ భోజన నిర్వహణ కష్టమని ఈ పరిస్థితుల్లో ఆందోళనలే శరణ్యమని కొందరు పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-12-08T05:48:39+05:30 IST