Abn logo
Sep 26 2021 @ 23:16PM

అప్పగిస్తారా.. లేదా!?

నెల్లూరులోని వీఆర్‌ హైస్కూలు

ఎయిడెడ్‌ బడులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం

ఇప్పటికే యాజమాన్యాలతో విద్యా శాఖ సమావేశం

అప్పులు లేకుండా భవనాలు స్వాధీనం చేయాలి

లేకుంటే బోధన సిబ్బందినైనా అప్పగించాల్సిందే

సుముఖత తెలపని వాటిపై తనిఖీలు


నెల్లూరు (విద్య) సెప్టెంబరు 26 : ఎయిడెడ్‌ పాఠశాలల వైభవం పూర్తిగా కనుమరుగు కానుంది. గతంలో ధార్మిక సంస్థలు నిర్వహించే ఈ పాఠశాలలకు మంచి డిమాండ్‌ ఉండేది. కాలానుగుణంగా  వచ్చిన మార్పుల కారణంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు రావడం, మారుమూల ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో ఎయిడెడ్‌ ప్రాభవం తగ్గింది. 2004 తరువాత ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటివరకు పనిచేసిన వారు పదవీవిరమణతో ఖాళీలు ఏర్పడటం, టీచర్ల కొరత అధికమైంది. ఈ తరుణంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నెం.50తో ఎయిడెడ్‌లను పూర్తిగా మూసివేసేలా రంగం సిద్ధమైంది. ఉపాధ్యాయులు, ఆస్తులు రెండింటినీ స్వాధీనం చేసుకునేందుకు సముఖుత వ్యక్తం చేయని వాటిపై తనిఖీలు చేపట్టనున్నారు. 


జిల్లాలో 122 పాఠశాలలు..


జిల్లాలో ఎయిడెడ్‌ యాజమాన్య పరిధిలో 72 ప్రాథమిక, 28 ప్రాథమికోన్నత, 22 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 122 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 360కిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తుండగా 8,388 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.  ప్రభుత్వ నిర్ణయంతో ఆయా యాజమాన్యాలను స్వాధీనం చేసుకునే చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఇప్పటికే సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు ఆయా ప్రతినిధులతో సమావేశం కూడా నిర్వహించారు. రాతపూర్వకంగా అంగీకార పత్రాలు ఇవ్వని వారిపై చర్యలకు  ఉపక్రమిస్తున్నారు. నయానో, భయానో రాతపూర్వక సుముఖుత నివేదికలను తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయంపై కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ తీర్పు వచ్చేలోగా ప్రక్రియను వేగవంతం చేసేలా అధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఎయిడెడ్‌ కళాశాలలకు సంబంధించిన అధ్యాపకుల కౌన్సెలింగ్‌కు షెడ్యూలు కూడా విడుదల చేయడం వంటి అంశాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని ఖచ్చితంగా తెలియచేస్తోంది. పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూడా త్వరలో జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తూ కౌన్సెలింగ్‌ చేపడతారని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


విద్యార్థు భవిష్యత్‌ ప్రశ్నార్థకం


‘ఎయిడెడ్‌’ విద్యార్థులను గందరగోళానికి గురికాకుండా, ఇబ్బందులు పెట్టకుండా ఎలా కొనసాగిస్తారన్న దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ సాగుతోంది. ఇప్పటికే నగరపాలక, జడ్పీ పాఠశాలల్లో టీచర్ల కొరతతో అవస్థలు పడుతుండగా అదనంగా ఎయిఎడ్‌ పాఠశాలల విద్యార్థులను కూడా చేర్చుకోవడం తమను ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.


ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాము. స్వాధీనానికి సముఖుత వ్యక్తం చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాము. తొలుత ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలుగా అనుమతి ఇస్తాము. అక్కడ చదివే విద్యార్ధులను కూడా అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వానికి పాఠశాలలను అప్పగించకుండా కేవలం సిబ్బందిని, విద్యార్థులను అప్పగించిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేలా ఆదేశాలిచ్చాము. ఎయిడెడ్‌లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేసి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. 

- రమేష్‌, డీఈవో