బడి తీసేదెప్పుడు ?

ABN , First Publish Date - 2020-08-05T09:25:38+05:30 IST

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను చూస్తుంటే ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఉన్నత విద్యా సంస్థల విషయం ఎలా ఉన్నా

బడి తీసేదెప్పుడు ?

పాఠశాలలు పున: ప్రారంభంపై జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్‌ సర్వే  

అక్టోబర్‌ అయితేనే మేలు 

మొగ్గు చూపుతున్న ఎక్కువ శాతం తల్లిదండ్రులు 

జిల్లాలో 1915 మంది నుంచి అభిప్రాయాల సేకరణ 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను చూస్తుంటే ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఉన్నత విద్యా సంస్థల విషయం ఎలా ఉన్నా పాఠశాలల ప్రారంభంపై మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చినా తరువాత కరోనా ఉధృతి ఇంకా కొనసాగడంతో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. దీంతో అన్ని తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఎప్పుడు తెరిస్తే బాగుంటుందనేది తెలుసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం సేకరించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.


రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆదేశాల మేరకు పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలి, పాఠశాలల నిర్వహణ ఎలా ఉండాలనే విషయమై  జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1915 మంది విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న ఈ సమయంలో పాఠశాలలు తెరవద్దని, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో పాఠశాలలు తెరిస్తే పిల్లలు  ఇబ్బందులు పడతారనే అభిప్రాయం అత్యధిక శాతం తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు అక్టోబర్‌ నెలలో పాఠశాలలు తెరవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వేలో తల్లిదండ్రులు వెలిబుచ్చిన అభిప్రాయాల వివరాలతో రూపొందించిన నివేదికను జిల్లా విద్యా శాఖ అధికారి పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు పంపించారు. 


అక్టోబర్‌లో ప్రారంభించాలి...

పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 45.6 శాతం మంది అక్టోబర్‌ నెలలో ప్రారంభించాలని చెప్పగా, 7.4 శాతం మంది సెప్టెంబర్‌ 3వ వారం నుంచి ప్రారంభించాలని సూచించారు. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభించవచ్చని 15.8 శాతం మంది చెప్పగా, 11.3 శాతం మంది ఆగస్టు 3వ వారం, 19.9 శాతం మంది ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభించాలని తెలిపారు. ముందుగా ఏయే తరగతులు ప్రారంభించాలన్న ప్రశ్నకు 60.1 శాతం మంది 8 నుంచి 10 తరగతులు ప్రారంభించాలని సూచించగా, 23.2 శాతం మంది 6 నుంచి 10 తరగతులు, 9.4 శాతం మంది 1 నుంచి 10 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. వారం రోజుల్లో ఎన్ని రోజులు పాఠశాలలను నడిపించాలనే ప్రశ్నకు 39.2 శాతం మంది 4 రోజులు పాఠశాలలు నడిపించాలని సూచించగా, 30.3 శాతం మంది 3 రోజులు, 24.4 శాతం మంది 6 రోజులు, మిగతా వారు 2 రోజుల పాటు నడిపించాలని తెలిపారు.


పాఠశాలకు విద్యార్థుల హాజరు ఎలా ఉండాలని భావిస్తున్నారనే ప్రశ్నకు 34.5 శాతం మంది తల్లిదండ్రులు ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు కొనసాగేలా చూడాలని చెప్పగా, 31.1 శాతం మంది తరగతిలోని విద్యార్థులను రెండు భాగాలుగా విభజించి రోజు విడిచి రోజు హాజరయ్యేలా చూడాలని, 23.2 శాతం మంది అన్ని తరగతులను రెండు గ్రూపులుగా విభజించి రోజు విడిచి రోజు హాజరు కావాలని, 11.2 శాతం మంది ప్రతిరోజూ అన్ని తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పాటు చేయడంలో ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్నకు 59.2 శాతం మంది ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీతో పాటు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని చెప్పగా, 30.3 శాతం మంది ప్రభుత్వం, మిగతా వారు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలని అని తెలిపారు.


ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను ప్రార ంభించే వరకు పిల్లల చదువులు ఎలా కొనసాగిస్తే మంచిదనే ప్రశ్నకు 33.2 శాతం టీవీల్లో వివిధ ఛానెళ్ల ద్వారా అని చెప్పగా, 19.5 శాతం మంది ఇంట్లో చదువుకున్న పెద్దల ద్వారా అని తెలియజేశారు. 11.8 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో ఆప్‌లు, వాట్సాప్‌ ద్వారా అని చెప్పగా, 35.5 శాతం మంది మాత్రం పైవాటిలో ఏ విధానమైనా అంగీకారమేనని తెలిపారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఎలా అందించాలనే ప్రశ్నకు 46 శాతం మంది కొంత కాలం వరకు వద్దని చెబితే, 30 శాతం మంది తరగతుల వారీగా విడివిడిగా ఎక్కువ స్థలాల్లో వడి ్డంచాలని సూచించారు. 19.9 శాతం మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తగిన సురక్షిత పద్ధతులు పాటిస్తూ నిర్వహించాలని చెబితే, మిగతా వారు ఇంతకు ముందు మాదిరిగానే కొనసాగించాలని తెలిపారు.


పాఠశాల పనివేళలు ఎలా ఉండాలనే ప్రశ్నకు 34.4 శాతం మంది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండాలని చెప్పగా, 33.9 శాతం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 21.5 శాతం మంది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండాలని సూచించగా, 14.8 శాతం మంది మాత్రం గతంలో మాదిరిగానే కొనసాగాలని అభిప్రాయ పడ్డారు. సిలబస్‌లో మార్పులు ఎలా ఉండాలనే ప్రశ్నకు 45.1 శాతం మంది సిలబస్‌ 50 శాతం తగ్గించాలని తెలియజేయగా, 21.7 శాతం మంది 30 శాతం, 18.3 శాతం 40 శాతం సిలబస్‌ తగ్గించాలని చెప్పగా, 14.8 శాతం మంది మాత్రం పాత సిలబస్‌నే కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. 


కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి...

పాఠశాలలు ప్రారంభించిన తరువాత కూడా కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సూచించారు. రోజూ పాఠశాలలను శానిటైజ్‌ చేయాలని, పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా షిఫ్ట్‌ పద్ధతిలో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి విధిగా మాస్కులు అందించాలని, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, ఎక్కువ సంఖ్యలో మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో హ్యాండ్‌వాష్‌తో పాటు శానిటైజర్‌  కూడా అందుబాటులో ఉండేలా చూడాలని వారు అభిప్రాయ పడ్డారు. 


నేడు కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం...

ఇదిలా ఉంటే, బుధవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో విద్యార్థుల చదువుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉన్నా ఆన్‌లైన్‌ విద్యా బోధన గురించి చర్చించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2020-08-05T09:25:38+05:30 IST