గాడి తప్పుతున్న పాలన

ABN , First Publish Date - 2020-07-10T10:40:08+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయం పరిపాలనలో గాడి తప్పుతోంది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ

గాడి తప్పుతున్న పాలన

నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్‌ యూనిఫాం కుట్టు పని 

సస్పెండ్‌ అయిన ఉద్యోగి విచారణ రిపోర్టు బహిర్గతం 

అబాసుపాలవుతున్న భద్రాద్రి జిల్లా విద్యాశాఖ

  

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూలై 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయం పరిపాలనలో గాడి తప్పుతోంది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ఇష్టానుసారం పరిపాలన సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే నిబంధనలతో పని లేకుండా ఏ పనైనా చేస్తున్నారని విమర్శలున్నాయి. వివిధ కారణాలవల్ల సస్పెండైన ఉపాధ్యాయులు, ఎంఈఓలు సంవత్సరం గడుస్తున్నాపోస్టింగులు రాక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, పైసలిచ్చిన వారికి వెంటనే నిబంధనలతో పనిలేకుండా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇందుకు ఇటీవల వెలుగులోకి వచ్చిన స్కూల్‌ యూనిఫాం కుట్టు పని సంఘటనే ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఎస్‌పీడీ (ఎస్‌ఎస్‌ఏ) జోక్యం చేసుకొని ఇద్దరు ఎంఈఓలకు నోటీస్‌లు జారీ చేయాల్సిన పరిస్థితి అందుకు నిదర్శనం. స్కూల్‌ యూనిఫాంను పాఠశాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) తీర్మాణం ప్రకారం స్థానికంగా ఉండే సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులకు, స్థానిక దర్జీలచే కుట్టించాలని, కుట్టు పని ఎవరికి ఇచ్చింది, ఎంతకు కుడుతామన్నారనే విషయాలపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.


అయినా వాటితో పనేంటనే ధీమాతో  ఓ అధికారి ఒత్తిడిపై ఎంఈఓలు నిబంధనలకు వ్యతిరేకంగా యూనిఫాం వస్త్రాన్ని నల్గొండ పంపి బలయ్యారు. చివరికి వారి నుంచి సంజాయిషీ కోరుతూ వివరణ ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఏ నోటీసులు జారీ చేసింది. దీనికితోడు ములకలపల్లి మండలంలో 2015-16 విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం అక్రమంగా తరలిస్తున్న కేసులో సస్పెండ్‌ అయిన ఓ ప్రధానోపాధ్యాయుని విచారణ నివేదిక ఆర్‌జేడీకి చేరక ముందే సదరు సస్పెండ్‌ అయిన ఉద్యోగితోపాటు మరి కొందరికి బహిర్గతం కావడం విద్యాశాఖ పాలన గాడితప్పిందనడానికి నిదర్శనం. విచారణ రిపోర్టుపై పలు ఆరోపణలు, అనుమానాలు వెలువడుతున్నాయి.


చివరికి తనకు చేరకుండానే విచారణ రిపోర్టు ఎలా బయటకు వచ్చిందని డీఈఓ సరోజనిదేవిపై ఆర్‌జేడీ లింగయ్య ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే  డీఈఓ హుటాహుటినా స్టాఫ్‌ మీటింగ్‌ నిర్వహించి సిబ్బందిపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది.  విచారణ రిపోర్టు బహిర్గతంపై ఆర్‌జేడీ లింగయ్యను వివరణ కోరగా ఆ సంఘటన 2015-16 విద్యాసంత్సరంలో జరిగిందని. ఆ ఉపాధ్యాయుడు ఇటీవల రిటైర్‌ అయ్యాడని, విచారణ చేసి నివేదిక సమర్పించాలని కోరగా విచారణ చేసిన అధికారి రిపోర్టును గోప్యంగా ఉంచకుండా బహిర్గతం చేయడం తప్పేనని అన్నారు. అందుకు సదరు అధికారికి శాఖాపరమైన ఆదేశాలు జారీచేశామన్నారు. విచారణ పారదర్శకంగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయని అడిగిన ప్రశ్నకు రిపోర్టును పరిశీలించి పారదర్శకంగా ఉంటేనే అంగీకరిస్తామని, లేనిపక్షంలో తిరిగి విచారణ చేయిస్తామని తెలిపారు.

Updated Date - 2020-07-10T10:40:08+05:30 IST