పాఠశాలల్లో ఆయాలు

ABN , First Publish Date - 2021-01-21T06:23:52+05:30 IST

పాఠశాలల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు ఆయాల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

పాఠశాలల్లో ఆయాలు


నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

400 మంది విద్యార్థులకు ఒకరు 

ఒంగోలు విద్య, జనవరి 20 : పాఠశాలల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు ఆయాల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పాఠశాల ఆవరణ , మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేందుకు ఆయాలను ఈ నెలాఖరులోపు పాఠశాలల్లో నియమించాలి. 400 మంది విద్యార్థుల వరకు ఒకరు, 401 నుంచి 800వరకు ఇద్దరు, 800పైన ఎంతమంది ఉన్నా ముగ్గుర్ని నియమించాలి. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో ఆయాలను నియమించరాదు. పాఠశాల ఆవాస ప్రాంతంలో నివశించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను ఆయాలుగా నియమించాలి. విద్యార్థుల తల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 60ఏళ్లలోపు వయసు ఉన్న ఆయాలు పనిచేస్తుంటే తల్లిదండ్రుల కమిటీ ఆమోదంతో కొనసాగించవచ్చు. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో పనిచేసే ఆయాలకు నెలకు రూ.6వేలు, 50మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో పనిచేసే ఆయాలకు మాత్రం రూ.3వేలు జీతం చెల్లిస్తారు. వీరికి 10నెలలు పూర్తి జీతం రెండునెలలు సగం జీతం ఇస్తారు. ఆయాల నియామకానికి పాఠశాల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలి. హెచ్‌ఎం కన్వీనర్‌గా, తల్లిదండ్రులు కమిటీ చైర్మన్‌, ఇద్దరు సభ్యులు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంటు, ఎడ్యుకేషన్‌ అసిస్టెంటు, ఒక మహిళా టీచరు, మరో డిజిగిన్నేటెడ్‌ టీచరు, సీనియర్‌ బాలుడు, బాలికలతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఆయాలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో ఉదయం 8 నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు, హైస్కూళ్లలో ఉదయం 8.45 నుంచి 11.45వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు పనిచేయాలని డీఈఓ సుబ్బారావు చెప్పారు. వారిని తొలగించే అధికారం తల్లిదండ్రుల కమిటీకి ఉందన్నారు. నియామకానికి సంబంఽధించి తగు చర్యలు చేపట్టమని ఉపవిద్యాధికారులను, ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు 


Updated Date - 2021-01-21T06:23:52+05:30 IST