Abn logo
Sep 29 2020 @ 21:14PM

ఏపీలో అక్టోబర్ 5న బడులు తెరవాలన్న నిర్ణయం మరోసారి వాయిదా

Kaakateeya

అమరావతి: అక్టోబర్ 5న పాఠశాలలను పున: ప్రారంభించాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసింది. ఏపీలో కరోనా ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 5న బడులు తెరవాలని నిర్ణయించినప్పటికీ.. పాఠశాలల పున: ప్రారంభాన్ని కరోనా ప్రభావం దృష్ట్యా నవంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు ఈ సమీక్షలో సీఎం జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అక్టోబర్ 5న విద్యాకానుక కింద విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.


ఇదిలా ఉంటే.. పాఠశాలలు తెరిస్తే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించే విషయంలో ఉపాధ్యాయలు ఎంత వరకు జాగ్రత్తలు తీసుకోగలరనే అంశంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి.  పాఠశాలలు తెరవడంపై ఉపాధ్యాయులు ఎవరూ పెదవి విప్పడంలేదు. తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జూన్‌లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు, కళాశాలలు ఎప్పటికి ప్రారంభమవుతాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. పాఠశాలలను నవంబర్ 2 నుంచి తెరవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అప్పటికీ కరోనా ప్రభావం తగ్గని పక్షంలో మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. కొందరు ఈ తరహా క్లాసులకు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు జరగడం లేదు. వర్చువల్‌ క్లాసుల ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


Advertisement
Advertisement
Advertisement