పాఠశాలల్లో కరోనా

ABN , First Publish Date - 2021-04-16T05:32:59+05:30 IST

జిల్లాలోని పాఠశాలల్లో కరోనా ప్రబలుతోంది. 1వ తరగతి పిల్లలకు కూడా వైరస్‌ సోకుతుండటంతో తల్లిదండ్రుల్లో అందోళన వ్యక్తమవుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 71 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా 136మంది విద్యార్థులకు కూడా సోకింది. గతంతో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది.

పాఠశాలల్లో కరోనా
విద్యార్థినికి టెంపరేచర్‌ చెక్‌ చేస్తున్న ఉపాధ్యాయుడు


ఒక్కరోజే 15మందికి పాజిటివ్‌ 

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 15 : జిల్లాలోని పాఠశాలల్లో కరోనా ప్రబలుతోంది. 1వ తరగతి పిల్లలకు కూడా వైరస్‌ సోకుతుండటంతో తల్లిదండ్రుల్లో అందోళన వ్యక్తమవుతోంది.  సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 71 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా 136మంది విద్యార్థులకు కూడా సోకింది. గతంతో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. గత 40 రోజుల్లో 37మంది ఉపాధ్యాయులు 48మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడి స్థానిక రిమ్స్‌లో చికిత్సపొందారు. మంగమూరు డొంకలోని ఒక ప్రైవేటు కార్పొరేటు కళాశాలలో కొందరు విద్యార్థులకు కరోనా సోకగా వారంరోజులపాటు కళాశాలను మూసివేశారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల హైస్కూల్‌లో ఒక టీచర్‌ కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. 


ఒక్కరోజే 15 మందికి పాజిటివ్‌ 

జిల్లాలో గురువారం ఒక్కరోజే పాఠశాలల్లో 15మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట జడ్పీ హైస్కూల్‌ లో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు, ఒక సీఆర్‌పీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. సంతమాగులూరు మండలం బడివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో 1, 3, 5 తరగతులు చదువుతున్న బాలికలకు కరోనా సోకింది. అద్దంకి మండలం మైలవరం జడ్పీ హైస్కూల్‌లో ఒక పదో తరగతి విద్యార్థికి, ఎన్‌జీపాడు మండలం బి.నిడమానూరు ఎయిడెడ్‌ పాఠశాలలో 5వతరగతి చదువుతున్న ఒక బాలికకు, వైపాలెం మండలం గోళ్ళగుడిపి ఎంపీయూపీ స్కూలులో ఆరవ తరగతి చదువుతున్న ఒక బాలుడు, ఒక బాలికకు కరోనా సోకింది. కందుకూరు జడ్పీ బాలుర హైస్కూలు, కందుకూరు మండలం అమలనాఽథునివారిపాలెం ఎంపీపీ స్కూలు, తర్లుపాడు మండలం మీర్జాపేట ఎంపీపీ యూపీ స్కూలులో ఒక్కొక్క టీచర్‌కు కరోనా సోకింది. 

 

Updated Date - 2021-04-16T05:32:59+05:30 IST