పాఠశాలల విలీనం!

ABN , First Publish Date - 2021-07-30T05:44:18+05:30 IST

నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

పాఠశాలల విలీనం!

తొలివిడత హైస్కూళ్లకు 250 మీటర్లలోపు వున్న ప్రాథమిక పాఠశాలలు ఎంపిక

జిల్లాలో 209 వరకూ ఉన్నట్టు గుర్తింపు

వీటిల్లో 115 స్కూళ్ల తరలింపు మాత్రమే సాధ్యమంటున్న అధికారులు

94 పాఠశాలలు యథాతథంగా కొనసాగింపు

గెడ్డలు, వాగులు, రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారుల నిబంధనలే కారణం

జిల్లా విద్యా శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీని ప్రకారం జిల్లాలో 181 ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో 209 ప్రాథమిక పాఠశాలలు వున్నట్టు గుర్తించారు. అయితే 115 ప్రాఽథమిక పాఠశాలల నుంచి మాత్రమే విద్యార్థుల తరలింపు సాధ్యమవుతుందని, వివిధ కారణాల వల్ల మిగిలిన 94 ప్రాథమిక పాఠశాలల విలీనం వీలు కాదని అధికారులు అంటున్నారు.


ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నూతన విద్యా విధానాన్ని అనుసరించి పాఠశాలల వర్గీకరణ, విలీన చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. కొత్త విద్యావిధానంలో మొత్తం ఆరు అంచెల్లో పాఠశాలలు వుంటాయని ప్రభుత్వం చెబుతున్నది. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు), ప్రీ హైస్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), హైస్కూళ్లు (3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్‌ ప్లస్‌ (3 నుంచి 12వ తరగతి వరకు)గా విభజించారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుందని, కిలోమీటరు లోపలే ఫౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుందని, 3 కి.మీ. పరిధిలో హైస్కూల్‌ వుంటుందని ప్రభుత్వం చెబుతున్నది. దీని ప్రకారం తొలుత ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలలను (3, 4, 5 తరగతులను) హైస్కూళ్లలో విలీనం చేయాలన్న ప్రతిపాదించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల లోపు గల ప్రాథమిక పాఠశాలలను మాత్రమే విలీనం చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం జిల్లాలో 209 ప్రాథమిక పాఠశాలలు వున్నట్టు విద్యా శాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే వీటిల్లో 94 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు హైస్కూల్‌కు వెళ్లి రావడానికి గెడ్డలు, వాగులు, రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులను దాటాల్సి వుండడంతో నిబంధనల ప్రకారం వీటిని విలీనం చేయడం వీలుకాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.  


ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన


నూతన విద్యా విధానం అమలుచేస్తే తమపై పనిభారం అధికం అవుతుందని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైస్కూళ్లలో ఇంతవరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వుండగా, నూతన విద్యా విధానం ప్రకారం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. అంటే మరో మూడు తరగతులు పెరుగుతాయి. దీనివల్ల ఉన్నత పాఠశాలల్లో వసతి, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని, పిల్లలు కూడా పెరుగుతారు కాబట్టి పర్యవేక్షణ కష్టమవుతుందని హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఉన్నత పాఠశాలలకు బదలాయించకపోతే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు బోధనపై ప్రభావం పడుతుందని అంటున్నారు. విద్యార్థులంతా ఒకేసారి మధ్యాహ్న భోజనం చేయడం వల్ల గందరగోళంగా వుంటుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. 


విలీనంతో ప్రయోజనాలు

బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో

ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు వున్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల పిల్లలను తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాము. దీనివల్ల  ప్రయోజనాలున్నాయి. ఈ మూడు తరగతుల పిల్లలకు కూడా సబ్జెక్టులవారీగా టీచర్లు వస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కూడా లభిస్తాయి. మూడు నుంచి పదో తరగతి వరకు ఒకేచోట వుండడం వల్ల జవాబుదారీతనం వుంటుంది. 

Updated Date - 2021-07-30T05:44:18+05:30 IST