బడి బహుదూరం!

ABN , First Publish Date - 2022-01-27T08:10:59+05:30 IST

రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే కనీసం 3కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఉన్నత పాఠశాలలకు 3కిలోమీటర్లు లోపు దూరంలో ఉన్న ప్రాథమిక..

బడి బహుదూరం!

  • స్కూలు కోసం 3 కిలోమీటర్లు వెళ్లాల్సిందే
  • ప్రాథమిక పాఠశాలల విలీనానికి రంగం సిద్ధం 
  • జాతీయ విద్యావిధానం ప్రకారం మ్యాపింగ్‌ 
  • ఎమ్మెల్యేలకు 3 రోజులు అవగాహన కార్యక్రమం 
  • నేటినుంచి సచివాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహణ 
  • మూడేళ్లలో 25 వేలకు పైగా పాఠశాలల విలీనం


అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే కనీసం 3కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఉన్నత పాఠశాలలకు 3కిలోమీటర్లు లోపు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ సిద్ధమైంది. నెలరోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ తుది దశకు వచ్చింది. ఎమ్మెల్యేలకు కూడా మ్యాపింగ్‌పై అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి 29 వరకూ మూడురోజుల పాటు దీనిపై ఎమ్మెల్యేలకు వెలగపూడి సచివాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించనుంది.  జాతీయ విద్యావిధానంలో భాగంగా 2023-24 నాటికి రాష్ట్రంలోని 25,396 ప్రాథమిక పాఠశాలలను అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 2,663 బడులను విలీనం చేశారు. ఇకపై పాఠశాలల వర్గీకరణ కూడా మారుతుంది. అంగన్‌వాడీ కేంద్రాలను శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్చి ప్రీ ప్రైమరీ(పీపీ) 1, ప్రీ ప్రైమరీ 2 బోధిస్తారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో-పీపీ1, పీపీ2, ఒకటో తరగతి, రెండో తరగతి ఉంటాయి.


ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు అంటే పీపీ1 నుంచి 5వ తరగతి వరకు ఉంటాయి. ప్రీ హైస్కూళ్లు అంటే 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటాయి. ఉన్నత పాఠశాలలు... 3 నుంచి 10వ తరగతి వరకు, హైస్కూల్‌ ప్లస్‌ 3 నుంచి 12వ తరగతి వరకు ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్ల తరగతులను నిర్వహిస్తారు. ఈ సర్దుబాట్లతో భవిష్యత్తులో నూతన ఉపాధ్యాయ నియామకాలు ఉండవని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటికే డీఎస్సీ ప్రకటించాల్సి ఉండగా... ఈ రెండున్నరేళ్లలో ఆ ఊసే లేదు. 20 వేలకు పైగా ఉపాఽధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఇకముందు కూడా వాటిని భర్తీచేసే అవసరం లేకుండా ఎన్‌ఈపీ అమలుచేసి పాఠశాలల విలీనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో, వారికి సమాధానం చెప్పేందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-01-27T08:10:59+05:30 IST