Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాస్మోటిక్స్‌.. కక్కుర్తి

చార్జీలు చెల్లించడంలో నిర్లక్ష్యం

ఇబ్బందుల్లో వసతిగృహాల విద్యార్థులు

12 వేల మంది విద్యార్థుల్లో వ్యాధుల భయం

హాస్టళ్లు ప్రారంభమైన దగ్గర నుంచి చెల్లింపుల్లేవు

చర్మ సంబంధ సమస్యలొస్తున్నా స్పందించని ప్రభుత్వం


ఇలా ఇవ్వాలి..

వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కాస్మోటిక్స్‌ చార్జీల కింద 3 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థినులకు రూ.110, 7 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.160, ఇంటర్‌ నుంచి డిగ్రీ విద్యార్థినులకు  రూ.160 చెల్లిస్తోంది. అదేవిధంగా 3 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.130, 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే వారికి రూ.155 చెల్లించాలి. ఆ డబ్బు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ డబ్బుతో విద్యార్థినులు కొబ్బరినూనె, బొట్టు బిళ్లలు, పౌడర్‌, సబ్బులు కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటారు. విద్యార్థులు మాత్రం సబ్బులు, కొబ్బరి నూనె కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిధులు విడుదల కాకపోవడంతో  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.గుంటూరు(విద్య), డిసెంబరు 7: తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో మెనూ సక్రమంగా అమలు కావడంలేదు. ఈ పరిస్థితుల్లో కనీసం విద్యార్థుల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా కాస్మోటిక్స్‌ చార్జీలు చెల్లించడం లేదు. వసతిగృహాలు తెరిచినప్పటి నుంచి కాస్మోటిక్స్‌ చార్జీలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల డబ్బులపైనా ప్రభుత్వం కక్కుర్తి చూపుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 72, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 54, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురుకుల, సంక్షేమ హాస్టల్స్‌ 28 వరకు ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో దాదాపు 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాల హాస్టళ్లలో మరో 4 వేల మంది ఇంటర్‌ నుంచి డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా కాస్మోటిక్స్‌ చార్జీలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. కాస్మోటిక్స్‌ చార్జీలు చెల్లించకపోవడంతో సబ్బులు, నూనెలు తదితరాలు కొనుగోలు చేయలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో సీజనల్‌వ్యాధులు విజృంభిస్తుండటం, కరోనా భయం.. సమూహాల కారణంగా వేధిస్తున్న చర్మ సంబంధ సమస్యలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని రకాల సమస్యలు విద్యార్థులను  చుట్టుముడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. నిత్యం సంక్షేమం పాటపాడే ప్రభుత్వానికి విద్యార్థులకు కాస్మోటిక్స్‌ చార్జీలు చెల్లించాలనే ధ్యాసలేకపోవడంపై అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో రోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నం గురుకుల హాస్టల్‌లో సామూహిక వ్యాధుల బారిన పడి విద్యార్థులు ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హాస్టళ్ల విద్యార్థులకు కనీసం ఆరోగ్య పరీక్షలు చేయించక పోగా కాస్మోటిక్స్‌ చార్జీలు కూడా చెల్లించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వ చెలగాటం అడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కాస్మోటిక్స్‌ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ట్రెజరీల్లో బిల్లులు 

హాస్టల్‌ విద్యార్థులకు సంబంధించిన కాస్మోటిక్స్‌ చార్జీల బిల్లులు ట్రెజరీలకు జమచేశాం. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయగానే విద్యార్థులకు అందజేస్తాం. హాస్టళ్లు ప్రారంభమైన దగ్గర నుంచి కాస్మోటిక్స్‌ చార్జీలు విడుదల కాలేదు.

- మధుసూదనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ

 

Advertisement
Advertisement