Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 29 2021 @ 14:59PM

జమ్మూ-కశ్మీరులో పాఠశాలలు, రోడ్లకు అమర సైనికుల పేర్లు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని రోడ్లు, పాఠశాలలు, భవనాలకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, ప్రముఖ సాహితీవేత్తల పేర్లు పెట్టబోతున్నారు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరుల త్యాగాలను గుర్తించి, గౌరవించే లక్ష్యంతో ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, రోడ్లు, భవనాలకు అమర సైనికులు, ప్రముఖుల పేర్లు పెట్టాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 


ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 108 మంది పేర్లతో ఓ జాబితాను తయారు చేసినట్లు తెలిపారు. ఈ జాబితాలో ఎక్కువగా భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది పేర్లు ఉన్నాయని, సాహిత్య అకాడమీ అవార్డులు పొందినవారి పేర్లు కూడా ఉన్నాయని, వీరంతా జమ్మూ-కశ్మీరుకు చెందినవారని  తెలిపారు. జమ్మూ-కశ్మీరు భద్రత, అభివృద్ధి కోసం అసాధారణ సేవలందించినవారిని గుర్తించి, గౌరవించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


2014లో ఉరిలో సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో అమరుడైన అసిస్టెంట్ పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ అక్బర్, 2009లో కుప్వారాలో చొరబాటుదారులను తిప్పికొట్టేందకు జరిగిన కార్యకలాపాల్లో అమరుడైన పారాట్రూపర్ షబీర్ అహ్మద్ మాలిక్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. 


Advertisement
Advertisement