సైంటిస్టులను తయారు చేయాలన్నదే నా కల!

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

దేశంలోని సైన్సు ఉపాధ్యాయుల పోటీ...వేలసంఖ్యలో దరఖాస్తులు...చివరికి రాత పరీక్ష తర్వాత ఎంపికైంది 87 మందే. ఆ తర్వాత మూడు దశల్లో స్ర్కీనింగ్‌. ..

సైంటిస్టులను తయారు చేయాలన్నదే నా కల!

దేశంలోని సైన్సు ఉపాధ్యాయుల పోటీ...వేలసంఖ్యలో దరఖాస్తులు...చివరికి రాత పరీక్ష తర్వాత ఎంపికైంది 87 మందే. ఆ తర్వాత మూడు దశల్లో స్ర్కీనింగ్‌. ఇస్రో శాస్త్రవేత్తల ప్రశ్నలు.. ఇలా ఎంతో ఆసక్తికరంగా జరిగిన ‘సారాభాయ్‌ నేషనల్‌ టీచర్స్‌ సైంటిస్ట్‌’ పోటీలో విజేతగా నిలిచారు.. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర. తెలంగాణలో సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి జడ్పీహెచ్‌స్కూల్‌లో పని చేస్తోన్న ఈ టీచరమ్మ జాతీయ అవార్డు పొందిన సందర్భంగా ‘నవ్య’తో ముచ్చటించారు. 


 ఈ విజయం ఊహించనిది. 2020 జూలైలో దేశవ్యాప్తంగా గణిత,సైన్సు ఉపాధ్యాయులకు జరిగిన పోటీ ఇది. నేను అప్పర్‌ప్రైమరీ స్కూల్‌ విభాగంలో జీవశాస్త్రానికి సంబంధించిన పోటీలో పాల్గొన్నా. ఫైనల్‌లో 16 మంది ఉపాధ్యాయులున్నారు. వారిలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ టీచర్లూ ఉన్నారు. జడ్పీహైస్కూల్స్‌ పోటీలో నిలబడతాయా? అనుకున్నా. టాప్‌ 3లో నిలిస్తే చాలనుకున్నా. పిల్లలకు పాఠాలు బోధించిన తీరు, వారితో ఎలాంటి ప్రయోగాలు చేయించాననే అంశాలపై ఐదు నిమిషాల్లో మాట్లాడమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పా. విజేత కావడం ఆనందం. ఇది పల్లెబడికి దక్కిన గౌరవం. సర్కారుబడి సాధించిన విజయం.  


అలా సైన్సుపై ఆసక్తి..

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ దగ్గర ఉండే వేములపల్లి గ్రామంలో పుట్టి పెరిగాను. జడ్పీహెచ్‌స్కూల్‌లో చదివా. ఏడో తరగతిలోని సైన్సు టీచర్‌ పాఠాలు అర్థవంతంగా చెప్పటంతో సైన్సుమీద ఆసక్తి పెరిగింది. పుస్తకాలు చదివా. సైన్సుమీద అవగాహన పెంచుకున్నా. దినపత్రికలు చదివి అప్‌డేట్‌ అయ్యేదాన్ని. బి.జడ్‌.సి చదివా. అరిస్టాటిల్‌  నా స్ఫూర్తి ప్రదాత. ఇక నేను చేసిన మొదటి సైన్స్‌ ప్రయోగం.. ఆకు తనంతకు తాను ఆహారం తయారు చేసుకుంటుందనే పిండిపదార్థం ప్రయోగం. ఇందుకోసం క్రొటాన్‌ ఆకుల్ని ఉపయోగించా. 


అదే పెద్ద సవాల్‌! 

2009లో ప్రభుత్వ టీచరయ్యా. 2015 నుంచి సూర్యాపేటలోని గరిడిపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో జీవశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. నా పార్టిసిపేషన్‌ కంటే పిల్లల పార్టిసిపేషన్‌కు ప్రాధాన్యం ఇస్తా. సందేహాలను లోపల పెట్టకుండా అడగమంటా. ప్రశ్నించే స్వేచ్ఛను ఇస్తా. అప్పుడు పిల్లల్లో ఉదయించే ప్రశ్నలకు కొదువే ఉండదు. ప్రయోగాలు నిరూపితం అయినపుడు పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు. ఇలా పిల్లల్లో సైన్సుపట్ల క్యూరియాసిటీ కలిగించటమే టీచర్‌కో ప్రధానమైన సవాల్‌. ముందు కొన్ని మోడల్స్‌ను నేనే చేస్తా. ఉదాహరణకు.. గౌర పైపులతో  స్టెతస్కోప్‌ చేశా. అది చూసి ఇయర్‌ఫోన్ల స్పీకర్లను లెవల్‌ పైప్‌కి జతచేసి స్టెతస్కోప్‌ తయారు చేశాడో విద్యార్థి. అయస్కాంతంతో పెన్నుని గాల్లో నిలువుగా నిలబెట్టే ప్రయోగం చేశా. అది చూశాక.. ఓ  విద్యార్థి అదే పెన్నును అడ్డంగా గాల్లో నిలబడేట్లు చేసి చూపించాడు. అదీ పిల్లల్లోని ప్రతిభ! 


డిజిటలైజేషన్‌ గొప్పతనమిది! 

2017 నుంచి డిజిటల్‌ పాఠాలు చెబుతున్నా. ఏడో తరగతినుంచి పదో తరగతి వరకూ చెప్పిన 14 సైన్సు పాఠాలు డీడీ యాదగిరి ఛానెల్‌లో ప్రసారం అవుతాయి. 2020 నుంచి డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ కంటెంట్‌ చేస్తున్నా. దీక్ష, ఎస్‌ఈఆర్‌టీ వాళ్లు సైన్సు బుక్స్‌లో క్యూఆర్‌ కోడ్స్‌ ఉంచారు. దాన్ని స్కాన్‌ చేస్తే వచ్చే వాటిలో అరవై వీడియోలు నావే. ఉదాహరణకు ఆకులోపలి భాగాలను చూడాలంటే మనకు కష్టం. అదే యానిమేషన్‌ ద్వారా చేసిన వీడియో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ వీడియో చూస్తూ ఆకులోపలికి ప్రయాణం చేస్తారు పిల్లలు. డిజిటలైజేషన్‌ గొప్పతనమిది. ఇక పిల్లలను పోటీలకోసం వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే కష్టం. తల్లిదండ్రులు ఒప్పుకోరు. నేను ఒకప్పుడు సైంటిస్టు కావాలనుకున్నా. ఇప్పుడు సైంటిస్టులను తయారు చేయాలనేదే నా డ్రీమ్‌! 


మా ఆయన పేరు మన్మథ్‌ రెడ్డి. తను కూడా టీచర్‌. పెళ్లయ్యాక నన్ను బిఈడీ, ఎమ్‌.ఎస్‌.సీ, ఎమ్‌.ఇ.డీ చదివించారు. మా పెద్దమ్మాయి సాయిశ్రీ బిటెక్‌.. చిన్నమ్మాయి మహాలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతోంది


 రాళ్లపల్లి రాజావలి


ఇవీ ముఖ్యమైన ప్రయోగాలు! 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ. అయితే ఇన్నోవేటివ్‌, క్రియేటివ్‌ నాలెడ్జికి కొదువేలేదు. బంకమట్టి, పేడ, కొబ్బరిపీచుతో కుండీ చేసి అందులో మొక్కలు పెంచితే వాటికి పోషకాలు అక్కర్లేదు. ఇక కాన్సర్‌ కారకాలను పీల్చేసే మొక్కల ప్రాజెక్టు నాకెంతో నచ్చింది. ఇంట్లోని టాయ్‌లెట్‌ క్లీనింగ్‌ కెమికల్స్‌తో పాటు డీప్‌ ఫ్రై చేసిన వంటనూనెలోంచి వచ్చే పొగలో క్యాన్సర్‌ వాయువులుంటాయి. వీటిని ఎయిర్‌ప్యూరిఫయర్లుగా పిలిచే కొన్ని మొక్కలు సులువుగా పీల్చేస్తాయి. 2019లో స్వాతి అనే అమ్మాయి పీవీసీ పైపులో ఎయిర్‌ప్యూరిఫైర్‌ మొక్కలను అమర్చి ఓ ప్రయోగం చేసింది. తక్కువ సూర్యకాంతిలో ఇంట్లో ఎలా వాటిని పెంచుకోవచ్చనేదే ప్రయోగం. నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలో కలుపు మొక్కలనుంచి ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ చేశాం. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST