సింధియా వర్గీయులకు కీలక శాఖలు

ABN , First Publish Date - 2020-07-14T06:35:26+05:30 IST

మధ్యప్రదేశ్‌లో కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరిన గ్వాలియర్‌ మహారాజా జ్యోతిరాదిత్య సింధియాకు కమలనాథులు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు ఆయన వర్గానికి చెందిన 12 మందిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు...

సింధియా వర్గీయులకు కీలక శాఖలు

భోపాల్‌, జూలై 13: మధ్యప్రదేశ్‌లో కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరిన గ్వాలియర్‌ మహారాజా జ్యోతిరాదిత్య సింధియాకు కమలనాథులు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు ఆయన వర్గానికి చెందిన 12 మందిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం తన కేబినెట్‌లోని 28 మంది మంత్రులకు శాఖలు కేటాయించగా.. సింధియా వర్గానికే కీలక శాఖలు దక్కాయి. సింధియాకు అత్యంత సన్నిహతుడైన తులసీ సిలావత్‌కు నీటిపారుదల శాఖతో పాటు మత్స్యశాఖ, సంబంధిత విభాగాలు దక్కాయి. మరో సన్నిహితుడు గోవింద్‌సింగ్‌ రాజ్‌పుత్‌ రెవెన్యూ, రవాణా శాఖలు పొందారు.


ప్రభురాం చౌధరికి ఆరోగ్య కుటుంబ సంక్షేమం, ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌కు విద్యుత్‌, మహేంద్రసింగ్‌ సిసోడియాకు పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, ఇమారతీదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖలు దక్కాయి. మిగతావారికీ ముఖ్యమైన శాఖలే కేటాయించారు. కాగా.. చౌహాన్‌ సాధారణ పరిపాలన, పౌర సంబంధాలు. నర్మదాలోయ అభివృద్ధి, పౌరవిమానయానం తదితర విభాగాలను తన వద్దే ఉంచుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత నరోత్తమ్‌ మిశ్రాకు హోంశాఖతో పాటు శాసనసభ వ్యవహారాలు, న్యాయ శాఖ దక్కగా.. ఇప్పటిదాకా ఆయన వద్ద ఉన్న ఆరోగ్య శాఖను చౌధరికి బదలాయించారు. మరో సీనియర్‌ నేత గోపాల్‌ భార్గవ పబ్లిక్‌ వర్క్స్‌, గ్రామీణ పరిశ్రమలు పొందారు. జగదీశ్‌ దేవదాకు ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలు దక్కాయి. సిఽంధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ బీజేపీ గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. 230 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం 25 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలల్లోగా వీటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. 


Updated Date - 2020-07-14T06:35:26+05:30 IST