మొక్కజొన్నకు ‘కత్తెర’ కాటు

ABN , First Publish Date - 2021-08-23T05:38:28+05:30 IST

మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు పంజా విసురుతోంది. మొలక దశ నుంచే ఈ పురుగు దాడి చేస్తోంది. వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. మందు ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ విజృంభిస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో 15 మండలాల్లో సుమారు 16 వేల హెక్టార్లలో మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. జి.సిగడాం, సంతకవిటి, రాజాం, పొందూరు, లావేరు, రణస్థలం, రేగిడి మండలాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. మొక్కదశలోనే పంటపై కత్తెర పురుగు దాడి చేస్తోంది.

మొక్కజొన్నకు ‘కత్తెర’ కాటు
మొక్కజొన్న పంటకు పురుగుమందును పిచికారీ చేస్తున్న రైతు

 మొలక దశ నుంచే దాడి చేస్తున్న పురుగు

 మందులు వినియోగించినా ఫలితం శూన్యం

 నష్టపోతున్న రైతులు

 (జి.సిగడాం)

మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు పంజా విసురుతోంది. మొలక దశ నుంచే ఈ పురుగు దాడి చేస్తోంది. వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. మందు ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ విజృంభిస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో 15 మండలాల్లో సుమారు 16 వేల హెక్టార్లలో మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. జి.సిగడాం, సంతకవిటి, రాజాం, పొందూరు, లావేరు, రణస్థలం, రేగిడి మండలాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. మొక్కదశలోనే పంటపై కత్తెర పురుగు దాడి చేస్తోంది. ఆకులను తినేయడంతో పాటు రంధ్రాలు చేస్తుండడంతో పంట ఎదగడం లేదు. పంట వేసి 50 రోజులవుతున్నా పురుగు బెడద వదలడం లేదు. ఐదు రోజులకు, వారానికి ఒకసారి రైతులు పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. మందు ప్రభావం ఉన్నంత వరకు కత్తెర పురుగు ఉధృతి తగ్గినా.. ఆ తరువాత షరామామూలే. దీంతో ఏం చేయాలో తెలియక  రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో  ప్రస్తుతం సుమారు 5వేల హెక్టార్ల వరకు పంటను కత్తెరపురుగు నాశనం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కత్తెర పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


 కత్తెర పురుగు వ్యాప్తి ఇలా..

ఫాల్‌ ఆర్మీవార్‌గా పిలిచే కత్తెర పురుగు జీవితకాలం వేసవిలో 30 రోజులు.. మిగతా కాలంలో 60 రోజుల వరకు ఉంటుంది. ఇది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వేగంగా విస్తరించగలదు. ఇది సుమారు 1500 గుడ్లు పెడుతుంది. పగలు కంటే రాత్రి సమయంలో ఒక చోట నుంచి వేరే చోటకు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. వీటిని నాశనం చేసేందుకు సరైన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే పురుగు మరింత వృద్ధి చెందుతుంది.


పెట్టుబడి ఎక్కువ.. లాభం తక్కువ

మొక్కజొన్న సాగుకు రైతులు అధిక పెట్టుబడి పెడుతున్నారు.  విత్తనాలు, కూలీల ఖర్చు, పది ఎరువు బస్తాలు కలిపి ఎకరాకు సుమారు రూ.20వేలు మదుపు అవుతుంది.  దిగుబడి సుమారు 25 క్వింటాళ్ల వరకు వస్తుంది. పెట్టుబడి పోను రూ.15 వేల వరకు మిగులుతుంది. గత ప్రభుత్వం 50 శాతం రాయితీపై పురుగు మందును సరఫరా చేసేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ రాయితీని నిలిపివేయడంతో బయట మార్కెట్‌లో పురుగు మందును అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు కత్తెర పురుగు, ఇతర తెగుళ్లు తమను నట్టేట ముంచుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. చివరకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు.


పంట చేతికి అందడం లేదు

నేను రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నా. పంటకు కత్తెర పురుగు సోకి నాశనం చేస్తోంది. మొక్కను పెరగనీయకుండా పురుగు కొరికేస్తుంది. నివారణ మందులు వినియోగిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఆశించిన స్థాయిలో పంట చేతికి అందకుండాపోతోంది. ఆర్థికంగా నష్టపోతున్నాం. 

 -మీసాల సూరిబాబు, రైతు, పెంట గ్రామం


అవగాహన కల్పిస్తున్నాం

కత్తెర పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విత్తనం వేసిన వారం నుంచి పది రోజులలోపు ఎకరానికి అరలీటరు వేపనూనెను రెండువందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 నుంచి 20 రోజుల మధ్యలో ప్రోపెనోపాస్‌ 250 మి.లీ., ఒక లీటరు వేపనూనె, 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని చల్లాలి. 20 నుంచి 30 రోజుల మధ్యలో ఎకరానికి ఇమామెక్టిన్‌ బెంజెయట్‌ 100 గ్రాములు, లీటరు వేపనూనెను 12 ట్యాంకులకు వచ్చేలా నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఫలితముంటుంది. 35 నుంచి 45 రోజుల మధ్యలో పురుగు తగ్గుముఖం పట్టకపోతే కొరజన్‌ 60 మి.లీ, వేపనూనె లీటరు, స్టైన్‌టారం 100 మి.లీ నీటిలో కలిపి  పంటకు పిచికారీ చేస్తే  పురుగు ఉధృతి తగ్గుముఖం పడుతుంది.

- బత్తిన ఇందుమతి, వ్యవసాయ అధికారి, జి.సిగడాం

Updated Date - 2021-08-23T05:38:28+05:30 IST