హెచ్‌ఎండీఏ అధికారాలకు కత్తెర!

ABN , First Publish Date - 2021-07-27T07:57:41+05:30 IST

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ).. 7 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ అధికారాలకు కత్తెర వేయాలని సర్కారు నిర్ణయించింది.

హెచ్‌ఎండీఏ అధికారాలకు కత్తెర!

  • లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల బాధ్యత జిల్లా కలెక్టర్లకే?
  • మాస్టర్‌ప్లాన్‌, భూసమీకరణ, సర్కారు భూముల లేఅవుట్లకే హెచ్‌ఎండీఏ పరిమితం
  • 7 జిల్లాల పరిధిలో విస్తరించిన సంస్థ..డీటీసీపీ అధికారాలూ కలెక్టర్లకు బదిలీ
  • టీఎస్‌బీపాస్‌ చట్టం ప్రకారమేనన్న సర్కారు.. కలెక్టర్లతో ఈ పనులన్నీ సాధ్యమేనా?


హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ).. 7 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ అధికారాలకు కత్తెర వేయాలని సర్కారు నిర్ణయించింది. ఇక హెచ్‌ఎండీఏ పరిధి దాటిన ప్రాంతాల్లో డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)కి ఉండే అధికారాలను కూడా కుదించేసింది. హైదరాబాద్‌ సహా ఏడు జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ లేఅవుట్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. లేఅవుట్లు, బహుళ అంతస్తుల భవనాలకు హెచ్‌ఎండీఏ క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి, అనుమతులు జారీ చేస్తుంది. హెచ్‌ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన హెచ్‌ఎండీఏ అధికారాలను కుదించి, జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలంటే ప్రత్యేక విభాగాలు ఉండాలి. అనుభవజ్ఞులైన అధికారులు, మౌలిక సదుపాయాలు ఉండాలి. కానీ, కలెక్టరేట్లలో ప్రస్తుతం ఇలాంటివేమీ లేవు! ఇప్పటికే అనేక పనులతో తీరిక లేని కలెక్టర్లకు లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల బాధ్యతలూ అప్పగించడమంటే వారిపై మరింత భారం మోపినట్లే. 


మరోవైపు లేఅవుట్లు, హైరైజ్‌ భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ ఎప్పటి వరకు దరఖాస్తులు తీసుకోవచ్చనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మంత్రి కేటీఆర్‌ ఈ నెల 19న హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మునిసిపల్‌ చట్టం-2019, తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌(టీ్‌సబీపాస్‌) చట్టం-2020 ప్రకారం హెచ్‌ఎండీఏ అధికారాలను తగ్గించాలని నిర్ణయించారు. టీఎ్‌సబీపాస్‌ చట్టం ప్రకారం.. ప్రతి జిల్లాకు కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి టీఎ్‌సబీపాస్‌ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీయే అధీకృత సంస్థగా వ్యవహరిస్తుంది. జిల్లా పరిధిలో అన్ని రకాల అనుమతులు, క్లియరెన్స్‌లకు సంబంధించి వచ్చే దరఖాస్తులన్నింటినీ పర్యవేక్షిస్తుంది. నిర్దేశిత సమయంలోగా వాటిని పరిశీలించి అనుమతులు జారీ చేయాలి. అలాగే జిల్లాల్లో లేఅవుట్ల అనుమతులను కూడా కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీనే ఇస్తుంది. చట్టంలోని ఈ నిబంధనల ప్రకారమే జిల్లా కలెక్టర్లకు డీటీసీపీ అధికారాలను బదలాయిస్తున్నట్లు ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన జీవో 105లో తెలిపింది. 


ఇప్పటివరకు హెచ్‌ఎండీఏకు ఉన్న లేఅవుట్ల అనుమతులు, బిల్డింగ్‌ పర్మిషన్లు లాంటి రెగ్యులర్‌ పనులను పక్కనపెట్టి, కేవలం ప్రణాళికలపైనే దృష్టిపెట్టాలని ఈ నెల 19న జారీ చేసిన మెమోలో తెలిపింది. అలాగే హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నిర్వహించాల్సిన విధులపైనా ప్రత్యేక సూచనలు జారీ చేసింది. 2008 వరకు హుడాగా ఉన్న సంస్థ కాస్తా తర్వాత హెచ్‌ఎండీఏగా మారింది. సర్కారుకు ఆదాయ వనరుగా మారింది. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ అందించే సేవలతో సమకూరే ఆదాయమంతా దానికే వెళ్తుంది. అక్కడి నుంచి సర్కారు తీసుకుంటుంది. తాజాగా సంస్థ అధికారాలకు కత్తెర వేయడం వల్ల ఇకపై వచ్చే ఆదాయమంతా నేరుగా సర్కారు ఖజానాకే చేరుతుంది.

 

7 జిల్లాల పరిధిలో విస్తరించి..

హెచ్‌ఎండీఏ మొత్తం ఏడు జిల్లాల్లోని 70 మండలాలు, 1032 గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడం, హైరైజ్‌ భవనాలకు, లే అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తుంది. హెచ్‌ఎండీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులిస్తారు. అలాగే అవుటర్‌రింగ్‌ రోడ్డు నిర్వహణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, నగరంలోని పార్కుల నిర్వహణ లాంటివి చూస్తుంటుంది. వీటికి తోడు భూ సమీకరణ, సర్కారు భూములను లేఅవుట్లు చేయడం, వేలం నిర్వహించడం కూడా చేస్తోంది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ లాజిస్టిక్‌ పార్కులను కూడా హెచ్‌ఎండీఏనే ఏర్పాటు చేస్తోంది. తద్వారా సర్కారుకు రూ.వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుతోంది.


కలెక్టర్లకు అధికారాలు

హెచ్‌ఎండీఏ పరిధిలో ఇచ్చే అన్ని రకాల నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇకపై కలెక్టర్లే ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని బిల్డింగ్‌, లేఅవుట్ల అనుమతుల అఽఽధికారాలను కూడా కలెక్టర్లకే ఇచ్చారు. మునిసిపాలిటీల అధికారాలను కూడా వారికే కట్టబెట్టారు.


హెచ్‌ఎండీఏ సిబ్బందిని ఏం చేస్తారు? 

మరోవైపు హెచ్‌ఏండీఏలోని ప్లానింగ్‌ విభాగంలో సుమారు 150 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్లానింగ్‌; మాస్టర్‌ ప్లాన్‌; ఇంజనీరింగ్‌ సెక్షన్‌, రెవెన్యూ, అకౌంట్‌ సెక్షన్లు ఉంటాయి. రెవెన్యూ సెక్షన్లలో సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన ఎమ్మార్వోలు కూడా పనిచేస్తారు. ఇక డీటీసీపీలో కూడా రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ఉన్నారు. వీరి అధికారాలను జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. అయితే ఈ బదలాయింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


ఇక హెచ్‌ఎండీఏ చేయాల్సిన పనులివే.. 

అధికారాల కుదింపుతో ఇకపై మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం, నగర పరిధిలోని రోడ్ల అభివృద్ధి, ల్యాండ్‌ పూలింగ్‌, ప్రభుత్వ భూములను లేఅవుట్లుగా మార్చడం, ప్రభుత్వ అనుమతితో వాటిని వేలం నిర్వహించడం లాంటి పనులకే హెచ్‌ఎండీఏ పరిమితం కానుంది. 

అర్బన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ నిర్వహణ

జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆధారిత మ్యాప్‌ను సిద్ధం చేయడం, అప్‌డేట్‌ చేయడం. రీజినల్‌ ప్లాన్‌ను సిద్ధం చేయడం. 

స్థానిక సంస్థల్లో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్లు, శ్మశానవాటికలు, ఆటస్థలాలు, పబ్లిక్‌ బిల్డింగ్స్‌కు సంబంధించిన ప్రణాళిలను సిద్ధం చేయాలి.

ల్యాండ్‌ పూలింగ్‌ విషయాల్లో డీటీసీపీ టెక్నికల్‌ అథారిటీగా వ్యవహరించాలి. ఇక ల్యాండ్‌ పూలింగ్‌ పథకం బాధ్యతను హెచ్‌ఎండీఏనే చేపట్టాలి.

ఏరియా డెవలె్‌పమెంట్‌, లోకల్‌ ఏరియా, టౌన్‌ప్లానింగ్‌ పథకపు ప్రణాళికలను సిద్ధం చేయాలి.

రహదారి అభివృద్ధి ప్రణాళికలను స్థానిక సంస్థల సమన్వయంతో  నిర్వహించాలి. 

హెచ్‌ఎండీఏ పరిధిలో వారసత్వ సంపద, పర్యాటకంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయాలి. 

ప్రణాళికా విభాగంలో జిల్లా కలెక్టర్లకు సూచనలు, సలహాలు ఇవ్వాలి.

అనధికార నిర్మాణాలు, అనుమతుల్లేని లేఅవుట్లను తొలగించే విషయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు మార్గనిర్దేశం చేస్తూ సలహాలివ్వాలి. 

హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ఇప్పటివరకు చేసిన విధుల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు.



ఎంతవరకు సాధ్యం?

లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల విషయంలో హెచ్‌ఎండీఏకు విశేష అనుభవం ఉంది. ఉదాహరణకు ఒక బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి ఫైల్‌ ఏ, ఫైల్‌ బీ ఉంటాయి. ఫైల్‌ బీలో రెవెన్యూ క్లియరెన్స్‌ అంతా ఉంటుంది. ఏలో ప్లానింగ్‌, సాంకేతిక పరిశీలన, డ్రాయింగ్‌ ఉంటుంది. ఈ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తుంది. అటువంటి ప్రాజెక్టులకు బ్యాంకులు సైతం రుణాలిస్తాయి. అందుకే హెచ్‌ఎండీఏ అనుమతించిన వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏ విధులను జిల్లా కలెక్టర్లు ఏ మేరకు చేయగలుగుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే  కలెక్టర్లపై పని ఒత్తిడి ఉందని, ఇంత పెద్ద బాధ్యతలను నిర్వహించే యంత్రాంగం కలెక్టర్ల వద్ద లేదనే విమర్శలున్నాయి. హైదరాబాద్‌లాంటి చోట్ల ఇటువంటివి కలెక్టర్లకు అప్పగించడం వల్ల బడా రియల్టర్లకు ప్రయోజనమని.. సామాన్యులకు ఇబ్బందులు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-07-27T07:57:41+05:30 IST