మన్నేరులో ఇసుక కోసం పోట్లాట

ABN , First Publish Date - 2021-06-15T07:14:51+05:30 IST

ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉన్న మన్నేరులో ఇసుక తోలకం రెండు వైపుల ఉన్న ఇసుక తోలకం దారుల మధ్య స్వల్ప వివాదానికి దారి తీసింది. సోమవారం రెండు చోట్ల ఇలాంటి వివాదాలు జరగ్గా, అధికారులు సమన్వయ పరిచారు.

మన్నేరులో  ఇసుక కోసం పోట్లాట
ట్రాక్టర్లను పరిశీలిస్తున్న అధికారులు

ఇసుక కోసం రెండు చోట్ల వివాదాలు 

అటు నెల్లూరు జిల్లా ఇటు ప్రకాశం జిల్లా

సర్ది చెప్పిన అధికారులు 

ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉన్న మన్నేరులో ఇసుక తోలకం రెండు వైపుల ఉన్న ఇసుక తోలకం దారుల మధ్య స్వల్ప వివాదానికి దారి తీసింది. సోమవారం రెండు చోట్ల ఇలాంటి వివాదాలు జరగ్గా, అధికారులు సమన్వయ పరిచారు. 

చీమలపెంట(లింగసముద్రం), జూన్‌ 14 : మండలంలోని పెంట్రాల పంచాయతీ పరిధిలోని చీమలపెంట, నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని శాయిపేట పంచాయతీ పరిధిలోని కుమ్మరపాలేల మధ్య ఉన్న మన్నేరులో ఇసుకపై వివాదం రేగింది. తమ గ్రామ సరిహద్దులో ఉన్న మన్నేరులో ఇసుక తరలిస్తున్నారంటూ కొండాపురం ఎస్సై రవిబాబు, పోలీసు సిబ్బంది సోమవారం లింగసముద్రం మండలానికి చెందిన 16 ట్రాక్టర్లను పట్టుకున్నారు. కుమ్మరపాలెం, మక్కెనవారిపాలేలకు తాగునీటిని అందించే మన్నేరులోని మంచినీటి పథకాల బావుల వద్ద ఇసుక తోడేస్తున్నారని, దీంతో పైపులు దెబ్బతినడంతో పాటు బావులకు నీరందవని అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆయన ట్రాక్టర్లను పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో లింగసముద్రం మండలంలోని చీమలపెంట, గంగపాలెం, తిమ్మారెడ్డిపాలెం, వెంగళాపురం, యర్రారెడ్డిపాలెం, లింగసముద్రం గ్రామాలకు చెందిన పలువురి ట్రాక్టర్లు మన్నేరులో ఇసుక కోసం కూలీలను తీసుకొని వెళ్లాయి. ఇసుక లోడ్‌ చేసుకుంటుడగా, కొండాపురం ఎస్సై రవిబాబు, సిబ్బందితో దాడి చేసి ఆ ట్రాక్టర్లను పట్టుకొని డ్రైవర్లను, యజమానులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ లోపు కొందరు ట్రాక్టర్ల యజమానులు లింగసముద్రం రెవెన్యూ అధికారులను సంప్రదించి విషయం చెప్పారు. పెంట్రాల సచివాలయం సర్వేయర్‌ కె. మణికంఠ సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్సై రవిబాబుకు, కొండాపురం వీఆర్వో ప్రసాద్‌కు మ్యాప్‌ ద్వారా మన్నేరు సరిహద్దులను చూపించారు. ఇసుక లోడ్‌ చేసిన ప్రాంతం లింగసముద్రం మండలంలోని పెంట్రాల పంచాయతీ సర్వే నంబరు 122 పరిధిలోని ప్రకాశం జిల్లా సరిహద్దులోకి వస్తుందని చెప్పారు. తమ మండల పరిధిలోని ట్రాక్టర్ల డ్రైవర్లు సరిహద్దు దాటిరాలేదని చెప్పారు. దీనికి ఎస్సై, వీఆర్వోలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు ట్రాక్టర్లును, డ్రైవర్లను విడిచిపెట్టారు. వాస్తవంగా వీరికి అనుమతి లింగసముద్రం మండలం వీఆర్‌కోట వద్ద మన్నేరులో అనుమతి ఉంది. అయితే వారు చీమలపెంట వద్ద ఇసుక తీసుకోవడానికి వచ్చారు. ఈ రెండు గ్రామాల మధ్య ఏడు కిలోమీటర్ల దూరం ఉండడం గమనార్హం.

మరో ఘటనలో

ఉలవపాడు : ఇసుక తోలకం రెండు గ్రామాల మధ్య వివాదాన్ని రేపింది. మండలంలో మన్నేరు నదీ పరివాహక గ్రామాలైన ఆత్మకూరు, మన్నేటికోట ట్రాక్టర్‌ డ్రైవర్ల మధ్య కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆత్మకూరు గ్రామస్థులు తోలుతున్న ఇసుక ట్రాక్టర్లను మన్నేటికోట గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్లు కోల్లూరుపాడు బీసీ కాలనీ వద్ద అడ్డుకున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు గ్రామం మన్నేరు వద్ద ఇసుక రీచ్‌ ఉంది. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ పనులకు ఎక్కువ ఈ రీచ్‌ నుంచే ఇసుక తోలకం జరుగుతుంటుంది. తొలుత తమ గ్రామ ట్రాక్టర్‌ యజమానులకు అవకాశం ఇచ్చిన తరువాత ఇంకెవరికైనా ఇవ్వాలనేది ఆత్మకూరు గ్రామస్థుల వాదన. గతంలో మన్నేటికోట వద్ద ఇసుక రీచ్‌ ఉన్నప్పుడు ఆ గ్రామస్థులు కూడా ఇదేవిధంగా ప్రతిపాదించారనేది వారి వాదన. ఆత్మకూరు గ్రామ పరిధిలో సుమారు 30 ట్రాక్టర్లు ఉండగా మన్నేటికోట గ్రామనికి చెందినవి 10 ఉంటాయి. ఒకటీఅరా తోలకం అయితే మన్నేటికోట గ్రామం తాలుకు ట్రాక్టర్లను చూసీచూడనట్లు వదిలేసేవారు. ఇప్పుడు కరేడు నుంచి వయా ఉలవపాడు మీదుగా సుమారు రూ.4.50 కోట్లతో పనులు మొదలయ్యాయి. దీనికి సంబంఽధించి అధిక ట్రిప్పులు ఇసుక తోలకానికి ప్రభుత్వ అనుమతులు ఇచ్చింది. సుమారు 30 ట్రాక్లర్టు సోమవారం ఉదయం ఇసుక తోలకం మొదలుపెట్టాయి. ఇక్కడే రెండు గ్రామాల మధ్య ట్రాక్టర్‌ డ్రైవర్లకు వివాదం రేగింది. దీనిపై గత శుక్రవారం ఎంపీడీవో రవికుమార్‌, ఎస్సై విశ్వనాథరెడ్డి ఇరు వర్గాల ట్రాక్టర్‌ డ్రైవర్లతో మాట్లాడారు. స్థానికంగా ఆత్మకూరు గ్రామస్థులకు తొలుత 50 శాతం ప్రాధాన్యత ఇచ్చి మిగిలినది కాంట్రాక్టర్‌ నిర్ణయానికి వదిలేయాలని సర్ధిచెప్పారు. దీంతో మన్నేటికోట ట్రాక్టర్లకు ఇసుక తోలకం అనుమతి తీసుకున్నప్పటికీ వాటికి ఇసుక ఎత్తేది లేదని ఆత్మకూరు గ్రామ నాయకులు అడ్డుకున్నారు. దీంతో మన్నేటికోట గ్రామస్థులు తమకు అనుమతులు ఇవ్వకుండా ఎలా ఇసుక తోలుతారని కొల్లూరుపాడు బీసీ కాలనీ వద్ద ట్రాక్టర్లను అడ్డుకుని నిలిపేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇసుక తోలకం నిలిపేయాలని సూచించారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అధికారులు ఎలా పరిష్కారం చూపిస్తారో వేచి చూడాల్సి ఉంది. 

Updated Date - 2021-06-15T07:14:51+05:30 IST