క్వీన్ ఎలిజబెత్‌ను చంపుతానన్న వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-27T23:30:25+05:30 IST

జలియన్‌వాలా బాగ్ నరమేధానికి ప్రతీకారంగా బ్రిటిష్ క్వీన్

క్వీన్ ఎలిజబెత్‌ను చంపుతానన్న వ్యక్తి అరెస్ట్

లండన్ : జలియన్‌వాలా బాగ్ నరమేధానికి ప్రతీకారంగా బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్‌ను హత్య చేస్తానని ఓ వీడియోను విడుదల చేసిన వ్యక్తిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. స్నాప్‌చాట్‌లో అప్‌‌లోడ్ అయిన ఈ వీడియోలో ఆ వ్యక్తి పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు. తాను భారతీయ సిక్కు మతానికి చెందినవాడినని, తన పేరు జశ్వంత్ సింగ్ చయిల్ అని చెప్పుకున్నాడు. 


1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ నరమేధంలో మరణించినవారి తరపున తాను ప్రతీకారం తీర్చుకుంటానని నిందితుడు ఈ వీడియోలో తెలిపాడు. జాతి కారణంగా అవమానం, వివక్ష, హత్యలకు గురైనవారి తరపున కూడా ఇది ప్రతీకార చర్య అని పేర్కొన్నాడు. తన పేరు జశ్వంత్ సింగ్ చయిల్, అదే విధంగా డర్త్ జోన్స్ అని చెప్పాడు. 


1919 ఏప్రిల్‌లో అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్ నరమేధం జరిగింది. బైశాఖి పండుగ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న జన సమూహంపైకి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 1,000 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ పేర్కొంది. 


క్వీన్ ఎలిజబెత్ ప్రైవేట్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో జశ్వంత్‌ను భద్రతాధికారులు అరెస్టు చేసినట్లు బ్రిటిష్ మీడియా తెలిపింది. ఈ వ్యక్తి వయసు 19 సంవత్సరాలు ఉంటుందని పేర్కొంది. జశ్వంత్ తన కుటుంబంతో కలిసి సౌథాంప్టన్‌లో నివసిస్తున్నాడని, అధికారులు ఆ ఇంటికి వెళ్ళి, సోదాలు చేశారని పేర్కొంది. 


ఇదిలావుండగా, పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, సౌథాంప్టన్‌కు చెందిన 19 ఏళ్ళ వ్యక్తి రక్షిత ప్రదేశంలోకి అక్రమంగా చొరబడినట్లు అనుమానం కలగడంతో అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని మానసిక స్థితిపై నిపుణులతో పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. 


Updated Date - 2021-12-27T23:30:25+05:30 IST