పెట్లూరు ప్లాంటు వివాదానికి తెర

ABN , First Publish Date - 2021-12-07T04:48:33+05:30 IST

ఎట్టకేలకు పెట్లూరు వాటర్‌ ప్లాంటు వివాదానికి తెరపడింది.

పెట్లూరు ప్లాంటు వివాదానికి తెర
ప్లాంటును ప్రారంభిస్తున్న సర్పంచ్‌ ఝాన్సీరాణి

హామీ మేరకు ఉచితంగా మంచినీరు ఇస్తామన్న సర్పంచ్‌

వైసీపీ దుందుడుకు చర్యలతో ఇన్నాళ్లు రచ్చ


పెట్లూరు(కొండపి), డిసెంబరు 6 : ఎట్టకేలకు పెట్లూరు వాటర్‌ ప్లాంటు వివాదానికి తెరపడింది. సోమవారం గ్రామ సర్పంచ్‌ ఆరెతోటి ఝాన్సీరాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కార్యక్రమంలో భాగంగా మినరల్‌ వాటర్‌ప్లాంటును సింగరాయకొండ దేవీ సీఫుడ్స్‌ సహకారంతో పెట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసి ప్రారంభించారన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా తాగునీరు గ్రామానికి అందించారని ఆమె గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో ప్లాంటును స్వాధీనం చేసుకున్నారు. తాగునీటిని 20 లీటర్ల క్యాన్‌ను 3 రూపాయలకు విక్రయించారు. తాను సర్పంచ్‌గా గెలిచాక గ్రామ పంచాయతీకి ప్లాంటును అప్పచెప్పాలని కోరగా వైసీపీ నాయకులు అంగీకరించలేదన్నారు. తాను జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడంతో వారు స్పందించి వాటర్‌ ప్లాంటును గ్రామ పంచాయతీకి అప్పగించారన్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ ప్రకారం గ్రామస్థులకు ఉచితంగా తాగునీరందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏసురత్నం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆరెతోటి బాబూరావు, ఉపసర్పంచ్‌ మూలె రామారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T04:48:33+05:30 IST