అప్పుడు అమర శిల్పి జక్కనకు అవమానం... ఇప్పుడేమో ఈ శిల్పికి..

ABN , First Publish Date - 2020-08-02T01:39:03+05:30 IST

మనిషికి ప్రాణం పోయడం కష్టం కాదేమో... కానీ... శిల్పాలకు ప్రాణం పోయడం చాలా కష్టం. ప్రాణం

అప్పుడు అమర శిల్పి జక్కనకు అవమానం... ఇప్పుడేమో ఈ శిల్పికి..

హైదరాబాద్: మనిషికి ప్రాణం పోయడం కష్టం కాదేమో... కానీ... శిల్పాలకు ప్రాణం పోయడం చాలా కష్టం. ప్రాణం లేని శిల్పాలను, కేవలం రాతితో చెక్కిన శిల్పాన్నే ప్రాణంతోనే మన ముందు ఉన్నాయా? అన్నట్లు చెక్కాల్సి ఉంటుంది. అలా కొంత కాలం పాటు పరిశ్రమిస్తేనే గానీ శిల్పి శిల్పాలను నిలబెట్టలేడు. అలా ప్రాణమున్న శిల్పాలుగా... రాతి శిల్పాలను నిలబెట్టే క్రమంలో తన ఊపిరిని ఆ రాతి శిల్పాల్లో పోసినంత పనిచేసి... వాటికి జీవం పోస్తాడు.


తల్లి ప్రసవ వేదనతో తత్సమాన వేదన శిల్పికి కూడా ఉంటుంది. ఓ అమ్మ కడుపులోంచి బిడ్డ ఎంత సంఘర్షణతో ఈ లోకంలోకి వస్తాడో... శిల్పి మనస్సు, బుద్ధి కూడా అంతే సంఘర్షిస్తాయి ఓ శిల్పం రూపం కోసం.  ఈ లోకంతో మరిచిపోయి... ‘శిల్ప లోకం’ లోనే గడిపేస్తాడు. అలా కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచానికి పూర్తిగా కనెక్షన్ కట్ అవుతుంది. అంతలా శ్రమిస్తేనే.. శిల్పం మనల్ని కనువిందు చేస్తుంది.


ఇంత కష్టపడ్డ శిల్పికి... ‘‘వాహ్.. బాగుందయ్యా’’ అని అభినందించే సమాజం ఉండకపోయినా... పర్లేదు... కానీ... పోత పోసిన శిల్పాలను చిన్నతనంతో చూస్తే.. వాటిని ఖండ ఖండాలుగా చేస్తే.. శిల్పి ఊపిరే ఆగిపోయినంత పని అవుతుంది. ఆయన శరీరాన్నే ఖండ ఖండాలుగా చేసినట్లు ఆ శిల్పి ఆవేదన చెందుతాడు.


అచ్చు ఇలాంటిదే హైదరాబాద్‌లోని ఓ శిల్పికి జరిగింది. ఆయన పేరు ఆరెల్లి కుమార స్వామి. హైదరాబాద్‌లోని శివారులో ఉన్న కిస్మత్‌పురలో ఓ స్టూడియోను నెలకొల్పి శిల్పాలను చెక్కుతున్నారు. సమకాలీన సంఘటనలన్నింటిపైనా ఆయన శిల్పాలు చెక్కారు. చివరికి కరోనా మహమ్మారిపై కూడా శిల్పాలను చెక్కి ప్రజలను జాగృతం చేశారు.


తెలంగాణ మలిదశ ఉద్యమంలో అయితే... చెప్పాల్సిన పనేలేదు. చెప్పాల్సిన అంశాన్నంతా ఒక్క శిల్పంలోనే అమర్చినంత జక్కన ఆ కుమార స్వామి. వీరు తయారు చేసిన కుల వృత్తుల శిల్పాన్ని గజ్వేల్ మార్కెట్ యార్డులో కూడా నెలకొల్పారు. ఈ శిల్పాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే ఆవిష్కరించి... ఆయన్ను తెగ మెచ్చుకున్నారు. మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నేతలూ ఈయన ప్రాణం పోసిన శిల్పాలకు ముగ్ధులయ్యారు. 


మరో వారం రోజుల్లో సిద్దిపేట, మహబూబ్ నగర్, సిరిసిల్ల కూడళ్లలో ఈయన చెక్కిన శిల్పాలను ప్రతిష్ఠించి... శిల్ప కళను తెలంగాణ వ్యాపితం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంతలోనే ఓ ఘోరం జరిగిపోయింది. ఆయన ప్రాణం పోసిన శిల్పాలన్నింటినీ గుర్తు తెలియని వ్యక్తులు ముక్కలు ముక్కలుగా చేసి... రోడ్డు పక్కన పడేశారు.


‘‘ఈ రోజు నా జీవితంలో పెను ఉత్పాతమే సంభవించింది. పదేళ్ల పాటు రేయింబవళ్లు కష్టపడి తయారు చేసిన శిల్పాలను ఊరి బయట చిందర వందరగా పడి ఉన్నట్లు కనిపించాయి. నరక యాతన అనుభవించా. అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పాన్ని అప్పటి రాజులు దుర్బుద్ధితో ముక్కలు చేశారు. అప్పుడు ఆ శిల్పి మనస్సు కూడా వికలం చెందింది. ఇప్పుడు నాదీ అంతే’’ అని  శిల్పి కుమార స్వామి వాపోయారు. 


జరిగింది ఇదీ....

రెండేళ్ల క్రితం శిల్పి కుమార స్వామి ఓ వ్యక్తి నుంచి స్టూడియో కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ స్టూడియో నిర్మించి.. ప్రతి నెలా రెంట్ కడుతున్నారు. కొన్ని రోజుల నుంచి ఆ స్థల యజమానికి, మరో వ్యక్తికి హక్కుల గురించి వివాదం నడుస్తోంది. ఖాళీ చేయమని నోటీసులైనా ఇవ్వాలి... లేదంటే చెప్పనైనా చెప్పాలి. ఇరు వర్గాలూ ఈయనతో మాట కూడా చెప్పలేదు.


ఈ శిల్పి లేని సమయంలో వచ్చి... దౌర్జన్యంగా స్టూడియోను కూల్చేసి, శిల్పాలన్నీ వ్యాన్ లో ఎక్కించి... ఊరి బయట విసిరి కొట్టారు. కొన్నింటిని వెనక్కి తెచ్చుకున్నా... చాలా శిల్పాలు ఖండమైపోయాయి. ఇంత చేసి... పైగా బెదిరింపులు మొదలయ్యాయి. చేయని తప్పుకు అనవసరంగా తనను బలి చేశారని, వెంటనే తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని శిల్పి కుమార స్వామి డిమాండ్ చేస్తున్నారు. 
















Updated Date - 2020-08-02T01:39:03+05:30 IST