పారిస్‌లో దారుణం.. టీచర్‌ తలనరికిన మతోన్మాది!

ABN , First Publish Date - 2020-10-17T23:18:06+05:30 IST

పారిస్‌లో దారుణం.. టీచర్‌ తలనరికిన మతోన్మాది!

పారిస్‌లో దారుణం.. టీచర్‌ తలనరికిన మతోన్మాది!

పారిస్: ప్రపంచ ఫ్యాషన్‌కు పుట్టినిల్లు. అత్యంత స్వేచ్ఛ కలిగిన దేశం. యూరప్‌లోని ఫ్రాన్స్ దేశం పేరు చెప్పగానే మన మనసులో మెదిలే ఆలోచనలివే. ఫ్రీడమ్‌కు పెట్టింది పేరైన ఫ్రాన్స్‌లో విద్యార్థులకు స్వేచ్ఛ గురించి పాఠం చెప్పిన టీచర్‌ను హత్యచేశారు. చంపేసిన తర్వాత అతని తలను మొండెం నుంచి వేరు చేశారు. ఈ ఘటన గురించి విన్న ప్రపంచం ఉలిక్కిపడింది. ఓ పాఠం చెప్పినందుకే ఆ టీచర్‌ను చంపేశారని తెలిసి వణికిపోయింది.



పారిస్‌ సిటీకి 25మైళ్ల దూరంలోని ఎరాగ్నే పట్టణంలో ఈ ఘోరాతిఘోరం జరిగింది. కొన్‌ఫ్లాన్స్-సెయింటె-హోనోరైన్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో శామ్యూల్ పాటీ అనే 47ఏళ్ల టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ''భావ స్వేచ్ఛ" గురించి విద్యార్థులకు ఓ క్లాస్ చెప్పాడు. ఈ క్లాస్‌లో భాగంగా ఫ్రాన్స్ దేశ చరిత్రలో గుర్తుండిపోయే చాలా ఘటనలను వివరించాడు. వీటిలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సెటైరికల్ మ్యాగజైన్‌ చార్లీ హెబ్డోకు సంబంధించిన ఘటన కూడా ఒకటి.


క్లాస్ ప్రారంభించేముందే ఈ విషయం తీవ్రత శామ్యూల్‌కు తెలుసు. అందుకే తాను చూపించే కొన్ని ఫొటోలు ముస్లిం పిల్లలకు నచ్చకపోవచ్చని, కాబట్టి వాళ్లు బయటకు వెళ్లిపోవాలని సూచించాడు. వాళ్ల భావాలు దెబ్బతినకుండా ఉండేందుకు నచ్చజెప్పే ప్రయత్నంచేశాడు. దీంతో చాలామంది పిల్లలు శామ్యూల్ చెప్పినట్లే తరగతి నుంచి బయటకు వెళ్లిపోయారు కూడా. ఆ తర్వాత శామ్యూల్ తన క్లాస్ ప్రారంభించాడు. 2015లో చార్లీ హెబ్డో మ్యాగజైన్‌లో వచ్చిన కొన్ని కార్టూన్లను పిల్లకు చూపించాడు. ఫ్రాన్స్‌లోని ముస్లిం కమ్యూనిటీకి అప్పట్లో ఈ చిత్రాలు తీవ్రమైన ఆగ్రహం కలిగించాయి. ఎందుకంటే అవి మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన కార్టూన్లు.


ఇస్లాం మతం ప్రకారం, మహమ్మద్‌ ప్రవక్తను ఏ విధంగానైనా చిత్రించడం తప్పని తెలుస్తోంది. చార్లీ హెబ్డో ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో ఆ మ్యాగజైన్‌పై ముస్లింలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీగాక వ్యంగ్యంగా కార్టూన్లు వేయడంతో దీన్ని కొన్ని ఉగ్రవాద సంస్థలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే 2015 జనవరి 7న ఇద్దరు సోదరులు చార్లీ హెబ్డో ఆఫీసులోకి వెళ్లారు. తుపాకులతో అక్కడి ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 12మంది దుర్మరణం పాలవగా, 11మంది తీవ్రంగా గాయపడ్డారు.


భావస్వేచ్ఛ క్లాస్‌లో భాగంగా విద్యార్థులకు చార్లీ హెబ్డో ఘటనను వివరించడానికి శామ్యూల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ పత్రిక ప్రచురించిన కొన్ని కార్టూన్లను ప్రదర్శించాడు. ఈ విషయం తెలిసిన కొందరు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారితో శామ్యూల్‌, స్కూలు ప్రిన్సిపల్ తదితరులు సమావేశమై ఆ చిత్రాలు ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు. సంతృప్తి చెందిన తల్లిదండ్రులు మరోసారి ఇలాంటివి చేయొద్దని మాత్రం చెప్పి వెళ్లిపోయారు.


కొందరు ముస్లిం పేరెంట్స్ మాత్రం దీన్ని దిగమింగుకోలేకపోయారు. శామ్యూల్‌ను గూండా అంటూ తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. ఇలాంటి ఓ వీడియోను పారిస్‌లోని ఓ ప్రముఖ మసీదు కూడా షేర్ చేసినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని రోజులకే శామ్యూల్‌ను ఓ ఉన్మాది చంపేశాడు. సాయంత్రం స్కూలు నుంచి బయటకు వచ్చిన టీచర్‌పై దాడి చేశాడు. ఆపై అతని తలను మొండెం నుంచి వేరుచేశాడు.


తలనరికేసిన తర్వాత శామ్యూల్‌ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడా ఉన్మాది. ఫ్రాన్స్ ప్రధానిని తన పోస్టుకు ట్యాగ్ చేస్తూ.. ''అల్లా సేవకుడు అబ్దుల్లా" ఈ పని చేశాడంటూ శామ్యూల్ మృతదేహం ఫొటోలను షేర్ చేశాడు. ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వచ్చేసరికి నిందితుడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో చిన్న తుపాకీతో ఉన్న ఉన్మాదిని చూసిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. వారిని చూసిన ఉన్మాది పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు అతన్ని వదల్లేదు. చివరకు పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో నిందితుడిని కాల్చిచంపేశారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబంతోపాటు మొత్తం 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పారిస్ టీచర్‌ మరణంపై చార్లీ హెబ్డో మ్యాగజైన్ కూడా స్పందించింది. దీన్ని ఫ్రెంచి దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఈ పత్రిక అభివర్ణించింది. ఈ ''ఇస్లామిక్ టెర్రరిజా"న్ని నిలువరించాలంటే ప్రపంచమంతా చేతులు కలపాలని, కఠినంగా ప్రవర్తించాలని, లేదంటే దీన్ని అడ్డుకోలేమని ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. శామ్యూల్ ఉద్యోగం చేస్తున్న స్కూలు యాజమాన్యంతో ఫ్రెంచి దేశ విద్యాశాఖ మంత్రి సమావేశమయ్యారు. అలాగే ఫ్రెంచ్ ప్రధాని ఎమాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ స్కూల్‌ను సందర్శించారు. ఈ దాడిని ఇస్లామిక్ టెర్రరిస్టు చర్యగా అభివర్ణించిన ఆయన.. ఉగ్రవాదులు ఫ్రాన్స్‌ను విడగొట్టలేరని, నేడు దేశం మొత్తం మరణించిన టీచర్‌ వెనుకే నిలబడి ఉందని ప్రకటించారు.


పారిస్‌ టీచర్‌పై దాడి సోషల్ మీడియాలో అలజడి సృష్టించింది. నెటిజన్లంతా హత్యచేసిన ఉన్మాదిని, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎండగడుతున్నారు. ''భావ స్వేచ్ఛ" గురించి పాఠం చెప్పినందుకు అతన్ని చంపడమేంటని? తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన కొందరు మాత్రం.. ''ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్లు స్వేచ్ఛను చూపిస్తారు. అర్థం చేసుకోవాలి" అంటూ ట్వీట్ చేయడం దుమారం లేపింది. సదరు ట్వీట్ చేసిన వారి సమాచారాన్ని కూడా షేర్ చేసిన కొందరు నెటిజన్లు.. పాకిస్తానీల నుంచి ఇంతకుమించి ఏం ఆశిస్తాం? అంటూ మండిపడుతున్నారు. 

Updated Date - 2020-10-17T23:18:06+05:30 IST