నడి సముద్రంలో.. నరకం

ABN , First Publish Date - 2020-11-28T06:54:26+05:30 IST

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుఫాను ప్రభావం తో తీవ్ర ఇక్కట్లు పడిన వైనమిది.

నడి సముద్రంలో.. నరకం

  •  సముద్రంలో మునిగిన  విశాఖ ఫిషింగ్‌ బోటు
  • వేటసాగిస్తుండగా బోటుపైకి భీకర అలలు.. ఒక్కసారిగా బోల్తా
  • పక్క బోటులోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారులు

కాకినాడ (ఆంధ్రజ్యోతి): సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుఫాను ప్రభావం తో తీవ్ర ఇక్కట్లు పడిన వైనమిది. విశాఖకు చెందిన దానాసత్తి అనే ఫిషింగ్‌ బోటు నడిసముద్రంలో బోల్తా పడిపోయింది. రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లింది. శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు ఈదుకుంటూ వెళ్లి మరో బోటు ఎక్కి ప్రాణా లు కాపాడుకున్నారు. విశాఖకు చెందిన కొందరు మత్స్యకారులు 28 ఫిషింగ్‌బోటుల్లో సముద్రంలో ఈనెల 20న వేటకు బయలుదేరారు. వేటలో భాగంగా విశాఖ హార్బర్‌ నుంచి 60 నాటికల్‌ మైళ్ల దూరానికి వచ్చేసరికి తుఫాను ముప్పు పొంచి ఉందన్న సంగతి కోస్ట్‌గార్డు బృందాల నుంచి చేరింది. దీంతో వీరంతా వేట నిలిపివేశారు. దగ్గర్లో కాకినాడ హార్బర్‌ ఉందనే సమాచారంతో ఇటువైపు బయలు దేరారు. ఈ సమయంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాకినాడ తీరానికి కొన్ని గంటల్లో చేరుతామనుకునేలోపు సముద్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీస్థాయిలో సముద్రపు కెరటాలు ఎగసిపడ్డాయి. దీనికితోడు గాలుల తీవ్రత కూడా ఎక్కువయ్యాయి. అయినా ధైర్యంతో 35 బోట్లు కాకినాడ హార్బర్‌ వైపు కదిలాయి. ఈ క్రమంలో సముద్రం మధ్యలో ఒక్కసారిగా భారీ కెరటాలు ఈ బోట్లను ఢీకొట్టాయి. దీంతో దానాసత్తి అనే బోటు పైభాగం ముక్కలైపోయి నీళ్లలో మునిగిపోయింది. అందులోని ఏడుగురు మత్స్యకారులు బోటును కాపాడే ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేకపోయింది. దీంతో వీరంతా సమీపంలో ఉన్న మరో బోటులోకి ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇందులో ఒకరికి గాయాలు కావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక చేసేదిలేక మునిగిన బోటును వదిలి 34 బోట్లు కాకినాడ హార్బర్‌కు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నాయి. ఇక్కడ బెర్త్‌ల వద్ద లంగరు వేసిన తర్వాత కూడా అలల తీవ్రతకు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా బోట్లు దెబ్బతిన్నాయని విశాఖ మత్స్యకారులు వాసుపల్లి అప్పన్న, ఊళ్ల సత్తియ్య, టి.రత్నకుమార్‌, అల్లిపిల్లి అప్పన్న అల్లిపిల్లి దేవుడు, వాసుపల్లి రాజు తదితరులు వివరించారు. కాగా విశాఖ హార్బర్‌కు చెందిన ఫిషింగ్‌బోట్లు కాకినాడకు, కాకినాడవి విశాఖకు వెళ్లిలంగరు వేయకూడదని ఆయా సంఘాల నిబంధనలతో విశాఖ మత్స్యకారుల బోట్లను లంగరు వేయకుండా కొందరు అడ్డుకున్నారు. దీంతో హార్బర్‌లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం 27 బోట్లలోని 191 మంది మత్స్యకారులకు పునరావాసం కల్పించారు.

Updated Date - 2020-11-28T06:54:26+05:30 IST