యానాంలో సీన్‌ రివర్స్‌!

ABN , First Publish Date - 2020-06-06T09:01:04+05:30 IST

సాధారణంగా యానాం పేరు వినగానే చవకగా పెట్రోలు, కావలసినంత మద్యం..

యానాంలో సీన్‌ రివర్స్‌!

దేశం మొత్తంలో తేరుచుకోనిది ఇక్కడేనట

లాక్‌డౌన్‌ నాటి నుంచి నేటివరకు గ్రీన్‌జోన్‌లోనే యానాం

నేటికీ తెరుచుకోని మద్యం షాపులు


యానాం(ఆంధ్రజ్యోతి): సాధారణంగా యానాం పేరు వినగానే చవకగా పెట్రోలు, కావలసినంత మద్యం దొరుకుతుందని తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేసిన సందర్భాల్లో సైతం యానాం వెళ్లి తెచ్చుకున్న వారూ ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇటీవల ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా నుంచి యానాం మద్యం సీసాలు తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇది ఇక్కడి పరిస్థితికి అద్దంపట్టింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం షాపులు దేశం మొత్తంలో తెరుచుకున్నప్పటికీ యానాంలో మాత్రం ఇంకా తెరుచుకోలేదు. జనతా కర్ఫ్యూ విధించక ముందే అంటే మార్చి 19 నుంచే యానాంలో మద్యం షాపులను అధికారులు మూసివేశారు. లాక్‌డౌన్‌ 4 విడతలో మద్యం షాపులకు అనుమతి ఇచ్చినప్పటికీ పుదుచ్ఛేరిలో అనుమతులు ఇవ్వలేదు.


ఐదో విడత సడలింపు ఇచ్చినప్పటికి యానాం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. పలు ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు కమిటీలు, తనిఖీలు పేరుతో కాలయాపన చేస్తున్నారని పలువురు మందుబాబులు ఆరోపిస్తున్నారు. మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారని మందుబాబులు, షాపులో తెరిస్తే పనిదొరుకుతుందని సిబ్బంది నిత్యం ఎదురుచూస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరికి ప్రధానమైన ఆదాయ వనరు ఈ మద్యమే. దీంతో వచ్చే రెవెన్యూ భారీగా పడిపోయింది. లాక్‌డౌన్‌లో పలువురు యాజమానులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో పుదుచ్ఛేరి విద్యుత్‌శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి దేవెష్‌సింగ్‌తో కూడిన 11 మంది సభ్యుల బృందం యానాం చేరుకుని నాలుగు రోజులుగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని యానాం పరిపాలనాధికారి శివరాజ్‌మీనా తెలిపారు. మరో రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని సమాచారం.

Updated Date - 2020-06-06T09:01:04+05:30 IST