అమ్మకోసం 8 ఏళ్ల పాటు 10 రాష్ట్రాల్లో గాలింపు.... చివరకు...

ABN , First Publish Date - 2020-11-23T16:15:13+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని మాల్దాకు చెందిన సుజీత్ మండల్ తన తల్లి దురాలీ కోసం ఎనిమిదేళ్లుగా...

అమ్మకోసం 8 ఏళ్ల పాటు 10 రాష్ట్రాల్లో గాలింపు.... చివరకు...

గోరఖ్‌పూర్: పశ్చిమబెంగాల్‌లోని మాల్దాకు చెందిన సుజీత్ మండల్  తన తల్లి దురాలీ కోసం ఎనిమిదేళ్లుగా 10 రాష్ట్రాల్లో గాలించాడు. ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించింది. ఆమె యూపీలోని గోరఖ్ పూర్‌లోని మానసిక మందిర్ మహిళా ఆశ్రయ గృహంలో సుజీత్‌కు కనిపించింది. కుమారుణ్ణి చూసిన ఆ తల్లి పట్టలేని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఈ కథ మాల్దాకు చెందిన దులారీ మండల్ ఆమె కుమారుడు సుజీత్‌లకు సంబంధించినది. ఆమెకు సుజీత్ చిన్నకుమారుడు. తల్లిని కలిసిన సందర్భంలో సుజీత్ మీడియాతో మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో తమ ఇంటికి గ్రహణం పట్టినట్లయ్యిందన్నారు. ఆ సమయంలో తండ్రి చనిపోయాడని, అప్పుడు తనకు 11 ఏళ్లని తెలిపాడు.


అన్నయ్య ఉద్యోగ వేటలో పానీపట్ వెళ్లాడని, మూడేళ్ల తరువాత అతను చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలతో తన తల్లి ఇంట్లో ఒంటరిదైపోయిందని, తల్లికి తన సోదరి అండగా నిలిచేదన్నారు. అయితే 2013లో తన సోదరికి వివాహం నిశ్చయించారని, అయితే పెళ్లికి కొద్దిరోజుల ముందు ఆమె మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటనతో తల్లి మానసికంగా కుంగిపోయిందన్నారు. సోదరిని అంత్యక్రియలకు తీసుకువెళ్లిన సమయంలో తల్లి ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయిందని, ఆ నాటి నుంచి తల్లి కోసం వెదుకుతున్నానని తెలిపారు. తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయినపుడు తనకు 16 ఏళ్లు అని, తల్లి కోసం పశ్చిమ బెంగాల్‌లో అణువణువునా గాలించానని, ఆ తరువాత బీహార్, మహారాష్ట్ర, అసోం, ఛత్తీస్‌గడ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగానని తెలిపారు. తాను చదువును కూడా ఆపేసి, తల్లి కోసం ఊరూరా తిరిగానని పేర్కొన్నాడు. కాగా ఇటీవల పోలీసులు మతిస్థిమితం కోల్పోయిన ఆమెను మాతృఛాయా సంస్థకు తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం ఆమె కోలుకుంది. తన చిరునామా అక్కడి వారికి తెలపడంతో వారు సంబంధింత పోలీసులకు ఈ విషయం చెప్పారు. ఫలితంగా సుజీత్‌కు తల్లిజాడ తెలిసింది. దీంతో అతను గోరఖ్‌పూర్ చేరుకుని తల్లిని కలుసుకున్నాడు. ఆమె కూడా కుమారుడిని గుర్తించి భోరున విలపించింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోయాక సిలిగురి, కోల్‌కతా, ముంబై ప్రాంతాలలో తల దాచుకున్నట్లు తల్లి తెలిపింది. అయితే గోరక్‌పూర్ ఎలా వచ్చానన్న విషయాన్ని ఆమె తెలియజేయలేకపోయింది.

Updated Date - 2020-11-23T16:15:13+05:30 IST