కరోనా వేళ.. సీజనల్‌ మాయం!

ABN , First Publish Date - 2021-06-19T05:01:29+05:30 IST

కరోనా వేళ.. సీజనల్‌ మాయం!

కరోనా వేళ.. సీజనల్‌ మాయం!

 ఇరుజిల్లాల్లో తగ్గిన డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసులు

రెండేళ్లుగా తగ్గుముఖం పట్టిన వ్యాధుల వ్యాప్తి

అధికారుల చర్యలు, ప్రజల అప్రమత్తతే కారణమంటున్న నిపుణులు 

ఖమ్మం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఓ వైపు జనం కరోనాతో సతమతమవుతున్న సమయంలో.. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గతంలో వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైతే చాలు ఉమ్మడి జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా లాంటి వ్యాధులు తీవ్రంగా ప్రబలేవి. రాష్ట్రంలోనే అత్యధికంగా సీజనల్‌ మరణాలు ఉమ్మడి జిల్లాలోనే జరిగేవి. ప్రభుత్వాసుపత్రుల్లో కంటే ప్రైవేటులోనే అధికంగా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఈ రెండేళ్లలో సీజనల్‌ కేసుల సంఖ్య స్వల్పంగా ఉంటుండటంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉండడంతో గతంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడి ఏటా 100 నుంచి 200మంది వరకు మరణించేవారు. ఇంకావందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు. 

మార్పు తెచ్చిన కరోనా..

ఒకప్పుడు సీజనల్‌ బారిన పడిన జనం.. రెండేళ్లుగా కరోనా మహమ్మారి భయానికి ఆరోగ్యసూత్రాలు పాటిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చర్యలతోనే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటివి ప్రబలడం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరించడం, పట్టణ, పల్లెప్రగతి పనులతో పరిసరాలను శుభ్రం చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం, బ్లీచింగ్‌ చల్లించడం, ద్రావణాలను పిచికారీ చేయించడం లాంటి వాటితో దోమలు, వాటి లార్వాలు వృద్ధి చెందడం లేదని తెలుస్తోంది. 

ఖమ్మం జిల్లాలో ఇలా.. 

గతంలో ఖమ్మంజిల్లాలో బోనకల్‌, చింతకాని, ఖమ్మం, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, ముదిగొండ, కూసుమంచి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి తదిర మండలాల్లో సీజనల్‌ వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. 

సంవత్సరం వ్యాధి కేసులు

2016 మలేరియా     16

డెంగ్యూ     1,216 

చికున్‌గున్యా     0

2017 మలేరియా     42 

డెంగ్యూ     700

చికున్‌గున్యా     1 

2018 డెంగ్యూ     722 

మలేరియా     7 

చికున్‌గున్యా 219 

2019 డెంగ్యూ     1,972, 

మలేరియా    5 

చికున్‌గున్యా     119 

2020 డెంగ్యూ     23 

మలేరియా     5 

చికున్‌గున్యా     2

ఈ ఏడాది ఇప్పటివరకు డెంగ్యూ 12 కేసులు నమోదవగా మలేరియా, చికెన్‌గున్యా కేసులు నమోదుకాలేదు.  

భద్రాద్రి జిల్లాలో ఇలా.. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతం కావడంతో మలేరియా వ్యాప్తి అధికంగా ఉండేది. కానీ కరోన వ్యాప్తి తర్వాత అధికారులు చేపడుతున్న చర్యలు, ప్రజల అప్రమత్తతతో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. 

సంవత్సరం వ్యాధి కేసులు

2016 మలేరియా     1081 

డెంగ్యూ 144 

2017 మలేరియా 726 

డెంగ్యూ 148 

2018 మలేరియా     447 

డెంగ్యూ 400 

చికున్‌గున్యా     12 

2019 మలేరియా     604

డెంగ్యూ         694 

చికున్‌గున్యా 4

2020 మలేరియా 364 

డెంగ్యూ 26 

ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 111, డెంగ్యూ ఏడు కేసులు నమోదయ్యాయి.

గతం కంటే పరిస్థితి మారింది.. 

డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా మలేరియా అధికారి

గడిచిన రెండేళ్లలో పరిస్థితి మారింది. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా తుగ్గుముఖం పట్టాయి. గతంలో వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతమంతా సీజనల్‌ వ్యాధుల భయంతో వణికిపోయేది. ఇప్పుడు పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో దోమల వ్యాప్తి తగ్గింది. దీంతోపాటు కరోనా వ్యాప్తితో ప్రజలు ఆరోగ్య స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోవడం, నివాస పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజర్‌ వాడకం లాంటివి కూడా సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి తగ్గినట్టు చెబుతున్నారు. కానీ దీనిపై శాస్ర్తీయంగా స్పష్టత లేదు. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో ఒకటిరెండు కేసులు మినహా.. మైదాన ప్రాంతాల్లో సీజనల్‌ కేసులు నమోదవడంలేదు. 


Updated Date - 2021-06-19T05:01:29+05:30 IST