సీజనల్‌ వ్యాధులను నియంత్రించాలి

ABN , First Publish Date - 2020-08-13T10:44:54+05:30 IST

వరంగల్‌ మహానగర పరిధిలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధికారులను

సీజనల్‌ వ్యాధులను నియంత్రించాలి

మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు


వరంగల్‌ సిటీ, ఆగస్టు 12 : వరంగల్‌ మహానగర పరిధిలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధికారులను ఆదేశించారు. బాధ్యతలను విస్మరించే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బుధవారం వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలన చర్యలు, ఖాళీ ప్లాట్లు, దోమల నివారణ, మురికివాడలు, ముంపు ప్రాంతాల్లో తీసుకునే చర్యలను కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి ప్రకాశ్‌రావు సమీక్షించారు.


నగరంలో మురికివాడలు, వీలిన గ్రామాలు, మంపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నాలాలు, డ్రెయినేజీలలో చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి నిధులను వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న  డివిజన్లలో సబ్‌ ప్లాన్‌ నిధులతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  ఖాళీ ప్లాట్లతో చెట్ల తొలగింపు విషయమై యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకుంటే తీసుకోవాలని అన్నారు. డ్రెయినేజీలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


కమిషనర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్‌ నివారణ చర్యలపై దృష్టి పెట్టడం వల్ల ఆశించిన రీతిలో పనులు పూర్తి కాలేదన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగేశ్వర్‌, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో నారాయణరావు, ఇన్‌చార్జి ఎస్‌ఈ విద్యాసాగర్‌, ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


పీపీఈ కిట్ల అందజేత

బల్దియాలోని 400 మంది పారిశుధ్య సిబ్బందికి మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు బల్దియా కార్యాలయంలో పీపీఈ కిట్లను అందచేశారు. యుఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి మేయర్‌ పాల్గొన్నారు. అలాగే ఆర్‌పీ, సీవోలకు బల్దియా జీఎఫ్‌ నుంచి మేయర్‌ ప్రకాశ్‌రావు వేతనాలు మంజూరు చేయడం గొప్ప విషయమని కమిషనర్‌ పేర్కొన్నారు.  ఇలా వుండగా, బల్దియా కొనుగోలు చేసిన వివిధ రకాల నూతన వాహనాలను మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు ప్రారంభించారు. రూ.6.90 కోట్లతో 30 ట్రాక్టర్లు. 30 ట్రాలీలు. 13 స్వచ్ఛ ఆటోలతో పాటు నీటి సరఫరాకు 10 ట్యాంకర్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2020-08-13T10:44:54+05:30 IST