మున్సిపాలిటీలో సీజనల్‌ జ్వరాలు

ABN , First Publish Date - 2021-10-19T05:36:52+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ సీజనల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

మున్సిపాలిటీలో సీజనల్‌ జ్వరాలు
సాయిబాబానగర్‌లో గుండ్లకమ్మ కాల్వ దుస్థితి ఇలా..

  1. అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ 
  2. లోతట్టు కాలనీల్లో పరిస్థితి మరీ అధ్వానం 
  3. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు 


ఆత్మకూరు, అక్టోబరు 18: ఆత్మకూరు మున్సిపాలిటీ సీజనల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ పరిసరాలన్నీ  అపరిశుభ్రంగా తయారు కావడంతో దోమలు పెరిగాయి. దీంతో  ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్‌ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు  రహదారులు చిత్తడిగా మారాయి. పలు కాలనీల్లో డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో చాలాచోట్ల రహదారులపై వర్షపునీరు నిలిచిపోయింది. కొన్ని మురుగు కాలనీల్లో  పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీటిప్రవాహం నిలిచిపోయింది. మున్సిపల్‌ కార్యాలయంలో మొత్తం 46 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా వీరిలో నలుగురు మాత్రమే రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కూడా పట్టణ పరిశుభ్రత దెబ్బతినిపోయింది. ఇటీవల ఆరోగ్యశాఖ రాష్ట్ర కోఆర్డినేటర్‌ త్యాగరాజు ఆత్మకూరులో ఆకస్మిక తనిఖీలు చేసి పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పట్టణంలో ప్రధానంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి.  ఇంత  జరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు  చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  


కాలనీల్లో విజృంభిస్తున్న రోగాలు: ఆత్మకూరు పట్టణంలోని ఎస్పీజీ పాలెం, ఏబీఎం పాలెం, తోటగేరి, ఫోస్టాఫీసు వీధి, కాకులగడ్డ, నీలితొట్లవీధి, కొత్తపేట, గరీబ్‌నగర్‌, వెంగళరెడ్డినగర్‌, అర్బన్‌కాలనీ, సాయిబాబానగర్‌, ఏకలవ్యనగర్‌, హుసేన్‌సానగర్‌, రహమత్‌నగర్‌, ఇస్లాంపేట, లక్ష్మీనగర్‌, సంతమార్కెట్‌వీధి, కిషన్‌సింగ్‌వీధి, రాజావీధి, చిట్యాలవీధి తదితర కాలనీల్లో  అపరిశుభ్రత వల్ల   దోమ లు వ్యాప్తి చెందుతున్నాయి.  లోతట్టు కాలనీల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.  దోమల నియంత్రణకు ఫాగింగ్‌ చర్యలు చేపడుతున్నా  ఫలితం లేకుండా పోయింది.  ఇప్పటికైనా  అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. 


వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం 

ఆత్మకూరు పట్టణంలో వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే దోమల నివారణకై ఫాగింగ్‌ చేస్తున్నాం. అదేవిధంగా లార్వాదశలోనే దోమలను అరికట్టేలా నీరు నిల్వ వుండే ప్రదేశాల్లో వేస్టాయిల్‌ చల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం.  

- వెంకటదాసు, కమిషనర్‌, ఆత్మకూరు



Updated Date - 2021-10-19T05:36:52+05:30 IST