అక్రమార్కులపై ‘సెబ్‌’ కొరడా

ABN , First Publish Date - 2020-05-27T09:51:31+05:30 IST

అక్రమ మద్యం, సారా, ఇసుక రవాణాపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో

అక్రమార్కులపై ‘సెబ్‌’ కొరడా

మద్యం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణాపై దాడులు

7 రోజుల్లో 82 మద్యం, సారా కేసులు.. 86 మంది అరెస్టు

ఇసుక అక్రమ రవాణాలో 12 కేసులు.. 21 మంది జైలుకు


కడప (సిటి), మే 26 :  అక్రమ మద్యం, సారా, ఇసుక రవాణాపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (సెబ్‌) కొరడా ఝుళిపిస్తోంది. కేవలం 7 రోజుల్లో 82 మద్యం, సారా కేసులు నమోదు చేసి 86 మందిని అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో 12 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 21 మంది జైలు పాలయ్యారు. ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిని విభజించి కొత్తగా సెబ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్‌ శాఖలో సిబ్బందిని విభజించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్‌ఈబీ) పేరుతో ఈ నెల 18 నుంచి రంగంలోకి దింపింది. ప్రస్తుతం జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌ ఎక్సైజ్‌ శాఖకు కేటాయించగా అసిస్టెంట్‌ కమిషనర్‌, ఇద్దరు సూపరింటెండెంట్లు, 13 మంది సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 76 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లను ఎస్‌ఈబీకి కేటాయించారు. ఈ సిబ్బందితో ఎస్‌ఈబీ దాడులు చేపట్టింది.


94 సారా, మద్యం, ఇసుక కేసులు.. 107 మంది అరెస్టు

ఈనెల 18 నుంచి ప్రత్యేక విధుల్లోకి దిగిన ఎస్‌ఈబీ (సెబ్‌) సిబ్బంది మద్యం, ఇసుక అక్రమ రవాణాపై, సారా స్థావరాలపై ముమ్మర దాడులు చేశారు. వారం రోజుల్లో 94 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్టు చేశారు. సారాలో 57 కేసుల్లో 55 మందిని అరెస్టు చేసి 3585 లీటర్ల ఊటను ధ్వంసం చేసి 77 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఏడు వాహనాలను సీజ్‌ చేశారు. అక్రమ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి బిల్లులు లేని మద్యం అమ్మకాలకు సంబంధించి 25 కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్టు చేసి వారి నుంచి 83 లీటర్ల మద్యం, 3 లీటర్ల బీరు, 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన సంఘటనలకు సంబంధించి 12 కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశారు. ఇందులో 74 టన్నుల ఇసుక, 18 ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌, ఒక ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2020-05-27T09:51:31+05:30 IST