సీఎన్‌బీసీ ఆవాజ్ షో హోస్ట్‌పై సెబీ నిషేధం

ABN , First Publish Date - 2021-01-14T17:21:44+05:30 IST

మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సీఎన్‌బీసీ

సీఎన్‌బీసీ ఆవాజ్ షో హోస్ట్‌పై సెబీ నిషేధం

ముంబై : మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సీఎన్‌బీసీ ఆవాజ్ షో హోస్ట్ హేమంత్ ఘాయ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బుధవారం నిషేధం విధించింది. హేమంత్ ఘాయ్‌తోపాటు ఆయన భార్యను, తల్లిని కేపిటల్ మార్కెట్ నుంచి నిషేధించింది. పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం, సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించిన పరిశోధనాత్మక నివేదికలను ప్రచురించడం వంటి కార్యకలాపాలను చేపట్టరాదని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.  మోసపూరిత వ్యాపారం ద్వారా సృష్టించిన రూ.2.95 కోట్ల ఆదాయం జప్తుకు ఆదేశించింది. 


‘స్టాక్ 20-20’ షోలో చేయవలసిన సిఫారసు గురించి హేమత్ ఘాయ్‌కి ముందుగానే సమాచారం ఉందని సెబీ పేర్కొంది. తనకు ముందుగా తెలిసిన సమాచారాన్ని ఈ షోలో ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించుకుంటున్నారని సెబీ తెలిపింది. ఈ షోకు కో-హోస్ట్‌గా ఆయన వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రోజులో కొనదగిన, అమ్మదగిన స్టాక్స్ గురించి ఈ షోలో సిఫారసులు చేస్తూ ఉంటారు. 


సీఎన్‌బీసీని నడుపుతున్న నెట్‌వర్క్18 గ్రూప్ సెబీ చర్యల అనంతరం స్పందించింది. హేమంత్ ఘాయ్‌ని తక్షణమే ఈ షో నుంచి తొలగించినట్లు తెలిపింది. తమ ఉద్యోగులందరూ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుందని తెలిపింది. లిస్టెడ్ సెక్యూరిటీల ధరల మానిప్యులేషన్‌కు పాల్పడటంపై స్పష్టమైన నిషేధం ఉందని తెలిపింది. హేమంత్ ఘాయ్ కూడా ఈ ప్రవర్తనా నియమావళిపై సంతకం చేశారని తెలిపింది. 


Updated Date - 2021-01-14T17:21:44+05:30 IST