ఎస్‌ఈసీ గీత దాటింది!

ABN , First Publish Date - 2021-03-02T09:09:25+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది.

ఎస్‌ఈసీ గీత దాటింది!

వలంటీర్లను దూరంగా ఉంచితే ఎలా 

 పెన్షన్లు, రేషన్‌ పంపిణీ వలంటీర్ల బాధ్యత

వారి సెల్‌ ఫోన్లు తీసుకుంటే అన్నీ బంద్‌

హైకోర్టులో రాష్ట్రప్రభుత్వ అత్యవసర వ్యాజ్యం

విచారణ నేటికి వాయిదా

అధికార పరిధి దాటి ఎస్‌ఈసీ  ఉత్తర్వులు

అవి చట్ట విరుద్దం :ఎజీ శ్రీరాం


అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది.  ఆ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌ జైన్‌ అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు సోమవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఫిర్యాదులు అందాయనే కారణంతో పురపాలక ఎన్నికల్లో వారిని దూరంగా ఉంచుతామనడం సరికాదన్నారు.  పెన్షన్లు, రేషన్‌ అందించడం వలంటీర్ల విధుల్లో భాగమని.. పెన్షన్లు ఇచ్చే సమయంలో సెల్‌ ఫోన్లలో బయోమెట్రిక్‌ ద్వారా ఖరారు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని.. సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వివరించారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని.. అధికార పరిధి దాటి ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని.. ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.  పూర్తి స్థాయిలో వాదనలు వినేందుకు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.


జేసీ ప్రభాకర్‌రెడ్డి పిటిషన్‌..  

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో వలంటీర్లు అధికార పార్టీ అభ్యర్ధులకు సహకరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వారిని విధులకు దూరంగా ఉంచాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది హరీశ్‌ వాదనలు వినిపిస్తూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారం మొత్తం వలంటీర్ల చేతుల్లో ఉందన్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల దయతో వారిని నియమించారని.. ఈ నేపథ్యంలో వారు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. సమయం లేకపోవడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యాజ్యాలపై.. కౌంటర్లకు మరింత గడువివ్వండి
హైకోర్టుకు ఎస్‌ఈసీ అభ్యర్థన
అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ముడిపడిన వ్యాజ్యాలలో కౌంటర్లు దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టును కోరింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ చేసిన వినతికి అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేశారు. 4వ తేదీ నాటికి పిటిషనర్లకు కౌంటర్‌ కాపీలు అందజేయాలని ఎస్‌ఈసీని ఆదేశించారు. 

Updated Date - 2021-03-02T09:09:25+05:30 IST