అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు!

ABN , First Publish Date - 2021-03-08T10:26:53+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు పెరిగాయని తమదృష్టికి వచ్చిందని రాష్ట్ర

అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు!

అవి సరైనవో, కావో నిర్ధారించేందుకే విచారణ

అక్రమాలపై జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది

సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి

హైకోర్టులో కమిషనర్‌ నిమ్మగడ్డ కౌంటర్‌


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు పెరిగాయని తమదృష్టికి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించింది. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులపై ఒత్తిళ్లు, బెదిరింపులు.. ఆ తర్వాత బలవంతపు ఉపసంహరణలు జరిగినట్లు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయని, ఈ నేపఽథ్యంలోనే సదరు ఏకగ్రీవాలు సరైనవో కావో నిర్ధారించేందుకు విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ వేశారు. సదరు విచారణను నిలువరిస్తూ గత నెల ఫిబ్రవరి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అభ్యర్థించారు. ‘రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) ప్రచురించిన జాబితా ప్రకారం.. జడ్పీటీసీలకు 126 మంది, ఎంపీటీసీలకు 2,363 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు.. పరిస్థితుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి ఉంది. ఎన్నికల రద్దు, వాయిదా, తిరిగి నిర్వహించే అధికారం మాకుంది. ప్రజాస్వామ్యం, వ్యవస్థల మనుగడకు నిష్పాక్షిక, స్వేచ్ఛాయిత ఎన్నికలు ప్రాథమిక అవసరం. రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం ఎన్నికల విషయంలో అధికారానికి ఎన్నికల సంఘం ఏకైక కేంద్ర బిందువు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఉంటాయి’ అని గుర్తుచేశారు. వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్‌ వేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరారు. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల సమయంలో బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్‌ వేయలేని వారు, వేధింపుల కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్నవారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను గత నెల 18న కమిషనర్‌ ఆదేశించారు. ఆ ఉత్తర్వులను చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రత్నశేఖరరెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారు.


విచారించిన కోర్టు.. ఏకగ్రీవాలు ప్రకటించి ఫామ్‌-10 జారీ చేసిన చోట ఎలాంటి విచారణ జరపవద్దని.. ఫామ్‌-10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుని ఉంటే వాటిని ప్రకటించవద్దని పేర్కొంటూ గత నెల 19న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంలో తాజాగా కౌంటర్‌ వేసిన ఎస్‌ఈసీ.. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది.


మెప్మా సీఆర్పీలను ఎన్నికలకు దూరంగా ఉంచండి: ఎస్‌ఈసీ

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో మెప్మాలో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్స్‌, కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్‌లను మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లా కలెక్టర్లను, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. పలు జిల్లాల్లో వారు పార్టీల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.

Updated Date - 2021-03-08T10:26:53+05:30 IST