Abn logo
May 14 2021 @ 00:43AM

కరోనా రెండో డోసు వారికే టీకా

కనిగిరిలో వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది, పక్కన చైర్మన్‌ గఫార్‌

కనిగిరి, మే 13: మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని డాక్టర్‌ ఎన్‌.నాగరాజ్యలక్ష్మి కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు నాగరాజ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు రెండవ డోసు వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నట్లయితే కరోనా బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందన్నారు.  వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి స్వల్పమైన జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి రావడం సహజమని, వాటికి భయపడి వ్యాక్సిన్‌ వేయించుకోకుండా ఉంటే కరోనా బారిన పడే ప్రమాదం ఉందన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 

పామూరు : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండవ డోసు కరోనా టీకాల కార్యక్రమాన్ని గురువారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 165 మందికి టీకాలు వేయగా వారిలో 125 మందికి కోవిషీల్డ్‌, 40 మందికి కోవాగ్జిన్‌టీకాలు వేశారు. కాగా పామూరు, బొట్లగూడూరు ప్రభుత్వ వైద్యశాలలో 61 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో ఏడుగురికి పాజిటీవ్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం రంగసుబ్బారాయుడు, ఎస్సై అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌, డాక్టర్లు పి రాజశేఖర్‌, కె కామాక్షయ్య, పద్మసాయి ప్రశాంతి, సీహెచ్‌వో మురళీకృష్ణ, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

వలేటివారిపాలెం : స్థానిక హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సబ్‌కలెక్టర్‌ బార్గవ్‌తేజ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాప్యం లేకుండా వ్యాక్సిన్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ సయ్యద్‌ ముజిఫర్‌ రెహ్మన్‌, ఎంపీడీవో రఫీద్‌ అహ్మద్‌, ఎస్‌ఐ చావా హజరత్తయ్య, ఏపీఎం హనుమంతరావు, ఆర్‌ఐ ప్రసాద్‌, నాయకులు పరిటాల వీరాస్వామి, కట్టా హనుమంతరావు, వీఆర్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పీసీపల్లి : ఈ నెలాఖరు వరకు కేవలం రెండవ డోసు వారికి మాత్రమే కొవిడ్‌ టీకా వేస్తారని మండల కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి పోపూరి సింగారావు అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలోని కొవిడ్‌ టీకా కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అక్కడ వైద్య సిబ్బంది వేస్తున్న టీకా కార్యాక్రమాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తోందని వివరించారు. రెండవ డోసు టీకాను వేసిన అనంతరం తొలిడోసు టీకాను వేస్తామన్నారు. పీసీపల్లి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో 44 మందికి వ్యాక్సిన్‌ వేశారు. కాగా వివిధ గ్రామాలకు చెందిన 32 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా రామాపురం, మారెళ్ల, పెద చెర్లోపల్లి, దేశిరెడ్డిపల్లి, పిల్లివారిపల్లి, మురిగమ్మి, పెద ఇర్లపాడు గ్రామాలకు చెందిన 19 మందికి కరోనా వైరస్‌ పాజిటీవ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి బేగ్‌ తెలిపారు. 

కొండపి : కొండపిలోని హైస్కూల్‌ ఆవరణలో జరుగుతున్న కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేకాధికారి పీవీ. నారాయణరావు గురువారం పరిశీలించారు. వ్యాక్సినేషన్‌లో ఇబ్బందులను, ప్రజల అభిప్రాయాలను, సిబ్బంది పనితీరును నారాయణరావు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ వి.కామేశ్వరరావు, డాక్టర్లు పి. భక్తవత్సలం, సునీల్‌ గవాస్కర్‌ పాల్గొన్నారు.   

పామూరు : 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు అందుబాటులో ఉంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని  సీపీఎం నాయకులు ఎస్‌డీ హనీఫ్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద గురువారం జరుగుతున్న కరోనా టీకా కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిషీల్డ్‌ టీకాతో పాటు కోవాగ్జిన్‌ టీకా కూడా తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఆయన  సూచించారు. 

మర్రిపూడి : మండలంలో రెండవ విడత టీకాల కార్యక్రమానికి స్పందన కరువైంది. సుమారు 700మందికి పైగా రెండవ విడత టీకాలు వేయించుకోవాల్సి ఉంది. వీరిలో 400 మంది కోవాక్సిన్‌ టీకా వేయించుకోవాల్సి ఉండగా 300 మంది పైగా కోవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. అయితే మండల కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో దూరప్రాంతాల ప్రజలు రాలేదు. గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రత్యేకాధికారి పివి.నారాయణ సందర్శించారు. ఈ సందర్భంలో పలువురు కాకర్లలో మరో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై సుబ్బరాజు, తహసీల్దార్‌ వెంకటరెడ్డి ,వైధ్యాధికారులు సంగీతా, అశ్వని, సర్పంచ్‌ కదిరిభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement