ఢిల్లీ.. అదే జోరు

ABN , First Publish Date - 2020-09-26T09:08:42+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అంచనాలకు మించి అదరగొడుతోంది. అన్ని విభాగాల్లో రాణించిన ఈ జట్టు 44 పరుగుల తేడాతో ఫేవరెట్‌

ఢిల్లీ.. అదే జోరు

చెన్నైకి వరుసగా రెండో ఓటమి 

రాణించిన పృథ్వీ షా


దుబాయ్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అంచనాలకు మించి అదరగొడుతోంది. అన్ని విభాగాల్లో రాణించిన ఈ జట్టు 44 పరుగుల తేడాతో ఫేవరెట్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. ధోనీసేనకిది వరుసగా రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64), పంత్‌ (25 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్‌), ధవన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. చావ్లాకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131రన్స్‌ చేసింది. డుప్లెసి (43) పోరాడాడు. గత మ్యాచ్‌లో ఏడోస్థానంలో దిగి తీవ్ర విమర్శలపాలైన ధోనీ (12 బంతుల్లో 2 ఫోర్లతో 15) ఈసారి నాలుగో వికెట్‌ తర్వాత వచ్చినా విఫలమయ్యాడు. రబాడకు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.

పేలవంగా..: ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను చక్కటి వ్యూహంతో ఢిల్లీ బౌలర్లు ఇబ్బందిపెట్టడంతో 44 పరుగులకే వాట్సన్‌ (14), విజయ్‌ (10), రుతురాజ్‌ (5) వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అక్షర్‌, అమిత్‌ మిశ్రాల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ కష్టపడ్డారు. దీంతో ఇన్నింగ్స్‌ బాధ్యత డుప్లెసి, కేదార్‌ (26)పై పడింది. 14వ ఓవర్‌ నుంచి డుప్లెసి, జాదవ్‌ జోడీ బౌండరీలతో జోరు చూపించినా రన్‌రేట్‌ కూడా పెరుగుతూ వచ్చింది. డుప్లెసి రెండు క్యాచ్‌లను మిస్‌ చేసినా ఢిల్లీకి నష్టమేమీ కలగలేదు. చివరికి 16వ ఓవర్‌లో జాదవ్‌ను నోర్టెజ్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 18వ ఓవర్‌లో డుప్లెసి కూడా అవుట్‌ కావడంతో సీఎ్‌సకే ఆశలు ఆవిరయ్యాయి.

పృథ్వీ షా దూకుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌ శుభారంభం అందించారు. తొలి ఓవర్‌ రెండో బంతికే షా క్యాచ్‌ అవుట్‌ కావాల్సి ఉన్నా చెన్నై ఆటగాళ్లు అప్పీల్‌ చేయకపోవడంతో బతికిపోయాడు. ధవన్‌ కాస్త నిదానంగా ఆడినా షా మాత్రం దూకుడు తగ్గించలేదు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 35 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ధవన్‌ ఎనిమిదో ఓవర్‌లో 6,4తో బ్యాట్‌కు పనిచెప్పాడు. పవర్‌ప్లేలో 36 పరుగులే చేసిన ఢిల్లీ ఆ తర్వాత షా, ధవన్‌ చెలరేగడంతో 4 ఓవర్లలో 52 పరుగులు సాధించింది. అయితే వీరి జోరుకు వరుస ఓవర్లలో స్పిన్నర్‌ చావ్లా బ్రేక్‌ వేశాడు. దీంతో తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పంత్‌ (37 నాటౌట్‌), శ్రేయాస్‌ (26) జాగ్రత్తగా ఆడి మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు.

ధోనీ సూపర్‌ క్యాచ్‌: అయితే చేతిలో కావాల్సినన్ని వికెట్లున్నా.. చెన్నై బౌలర్ల రాణింపుతో చివర్లో ఢిల్లీ వేగంగా రన్స్‌ చేయలేకపోయింది. దీంతో ఒత్తిడి పెరిగిన కెప్టెన్‌ శ్రేయాస్‌ 19వ ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయి కీపర్‌ ధోనీకి చిక్కాడు. మహీ.. కుడివైపునకు సమాంతరంగా దూకుతూ అద్భుత క్యాచ్‌ పట్టేశాడు. ఇక చివరి ఓవర్‌లో 14 పరుగులు రాబట్టడంతో జట్టు 170 రన్స్‌ దాటగలిగింది.


స్కోరుబోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (స్టంప్డ్‌) ధోనీ (బి) చావ్లా 64, ధవన్‌ (ఎల్బీ) చావ్లా 35, పంత్‌ (నాటౌట్‌) 37, శ్రేయాస్‌ (సి) ధోనీ (బి) కర్రాన్‌ 26, స్టొయినిస్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 175/3; వికెట్ల పతనం: 1-94, 2-103, 3-161; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-38-0, సామ్‌ కర్రాన్‌ 4-0-27-1, హజెల్‌వుడ్‌ 4-0-28-0, చావ్లా 4-0-33-2, జడేజా 4-0-44-0.

చెన్నై: మురళీ విజయ్‌ (సి) రబాడ (బి) నోర్టెజ్‌ 10, వాట్సన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 14, డుప్లెసి (సి) పంత్‌ (బి) రబాడ 43, రుతురాజ్‌ (రనౌట్‌) 5, కేదార్‌ (ఎల్బీ) నోర్టెజ్‌ 26, ధోనీ (సి) పంత్‌ (బి) రబాడ 15, జడేజా (సి) మిశ్రా (బి) రబాడ 12, సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 131/7; వికెట్లపతనం: 1-23, 2-34, 3-44, 4-98, 5-113, 6-130, 7-131; బౌలింగ్‌: రబాడ 4-0-26-3, అక్షర్‌ 4-0-18-1, నోర్టెజ్‌ 4-0-21-2, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-42-0, అమిత్‌ మిశ్రా 4-0-23-0.

Updated Date - 2020-09-26T09:08:42+05:30 IST