సెకండ్‌ డోస్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2021-05-07T06:03:26+05:30 IST

జిల్లాలో మొదటి డోస్‌ కొవాగ్జిన్‌ వేసుకున్న చాలామందికి రెండో డోసు సకాలంలో అందుబాటులో లేదు. గత 14 రోజులుగా ప్రభుత్వం కొవాగ్జిన్‌ టీకాల పంపిణీని నిలిపివేసింది.

సెకండ్‌ డోస్‌ ప్లీజ్‌!

కోవాగ్జిన్‌ కోసం 30 వేల మంది ఎదురుచూపు

14 రోజులుగా పంపిణీ కాని టీకా 


కర్నూలు(హాస్పిటల్‌), మే 6: జిల్లాలో మొదటి డోస్‌ కొవాగ్జిన్‌ వేసుకున్న చాలామందికి రెండో డోసు సకాలంలో అందుబాటులో లేదు. గత 14 రోజులుగా ప్రభుత్వం కొవాగ్జిన్‌ టీకాల పంపిణీని నిలిపివేసింది. దీంతో తొలిడోసు వేసుకున్న వారు నిరీక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.76 లక్షల మంది మొదటి విడత టీకా వేసుకున్నారు. రెండో డోసు 1.07 లక్షల మంది వేయించుకున్నారు. రెండో డోసు కోసం ఇంకా 2.69 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. గడువు దాటిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.


వారి పరిస్థితి ఏంటి?

జిల్లాలో కొవాగ్జిన్‌ మొదటి డోస్‌ దాదాపు 50 వేల మంది, రెండో డోసు 20 వేల మంది వేయించుకున్నారు. గత 13 రోజులుగా ఈ టీకా నిల్వలు నిండుకున్నాయి. ఈ వారంలో దాదాపు 15 వేల మంది గడువు తీరిన వారికి కొవాగ్జిన్‌ వేయాల్సి ఉంది. తొలి డోసు వేసుకుంటే 4-6 వారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలి. మార్చిలో వేసుకున్న వారికి గడువు ముగిసింది. రెండో డోసు వారికి టీకాలు అందుబాటులో లేదు. కొవాగ్జిన్‌ టీకా వినియోగంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్ల 10 శాతం వృథా అయింది. అసలు కొవాగ్జిన్‌ వస్తుందా? లేదా? అన్న స్పష్టత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇవ్వలేకపోతున్నారు. 


గడువు దాటినా వేసుకోవచ్చు

కొవాగ్జిన్‌ టీకా వేసుకున్న వారికి 4-6 వారాలు, కొవిషీల్డ్‌ వేసుకున్న వారు 6-8 వారాలు దాటిన వెంటనే రెండో డోసు వేయించుకోవాలి. గడువు తీరిన తర్వాత రెండు, మూడు వారాల్లోగా రెండో డోసు వేసుకోవచ్చు. ఎలాంటి నష్టం ఉండదు. ఈ నెల 7వ తేదీలోపు జిల్లాకు కొవాగ్జిన్‌ టీకాలు వస్తాయి. 

-డా.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి

Updated Date - 2021-05-07T06:03:26+05:30 IST